Disqualification petitions: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీంకోర్టు తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం, ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు రెండు వారాల గడువును డెడ్ లైన్‌గా విధించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసును విచారించింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేక మమ్మల్నే తీసుకోమంటారా అంటూ సూటిగా ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇదే చివరి అవకాశం - కోర్టు హెచ్చరిక
ఈ కేసులో స్పీకర్ కార్యాలయం అనుసరిస్తున్న కాలయాపనపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని, ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్ తరఫు న్యాయవాది మరో నాలుగు వారాల సమయం కోరగా, కోర్టు దానికి నిరాకరించింది. ఇదే చివరి అవకాశం.. ఇంకా ఆలస్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని హెచ్చరిస్తూ, రెండు వారాల్లోగా తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని వివరిస్తూ అఫిడవిట్ ఇవ్వాలని, ఆ తర్వాతే అదనపు సమయం గురించి ఆలోచిస్తామని స్పష్టం చేసింది.
దానం, కడియం, సంజయ్ భవితవ్యంపై ఉత్కంఠ
మొత్తం పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుపై పిటిషన్లు దాఖలు కాగా, స్పీకర్ ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ఆధారాలు లేవని కొట్టివేశారు . అయితే, కీలకమైన దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్‌ల అనర్హత పిటిషన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉండటంతో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన ఈ ముగ్గురిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోని పక్షంలో, సుప్రీంకోర్టు నేరుగా జోక్యం చేసుకుని రాజ్యాంగబద్ధంగా తన అధికారాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. కడియం శ్రీహరి, సంజయ్ తాము కాంగ్రెస్ లో చేరలేదని ఇప్పటికే స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. దీంతో వారిద్దరిపై అనర్హతా పిటిషన్లను స్పీకర్ తిరస్కరించవచ్చు. కానీ దానం నాగేందర్ ..ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఉండటంతో ఆయనపై అనర్హతా వేటు తప్పదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ప్రజాస్వామ్య విలువలు - న్యాయ విచక్షణ
స్పీకర్ తీసుకున్న గత నిర్ణయాల్లోని లోపాలను తాము ఈ దశలో పరిశీలించలేమని, అభ్యంతరాలు ఉంటే విడిగా న్యాయ ప్రక్రియల ద్వారా రావాలని కోర్టు సూచించింది. అయినప్పటికీ, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం స్ఫూర్తిని కాపాడటంలో స్పీకర్ వ్యవస్థ వేగంగా స్పందించాలని కోర్టు అభిప్రాయపడింది. రెండు వారాల తర్వాత జరగబోయే తదుపరి విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోబోతోందని ఆసక్తికరంగామారిది.