న్యూఢిల్లీ/ హైదరాబాద్: తనపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ నమోదైన కేసులో నిందితుడికి ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సవాల్‌ చేస్తూ 40 ఏళ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీనిపై మంగళవారం విచారించిన జస్టిస్‌ సందీప్‌మెహతా, జస్టిస్‌ విజయ్‌బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ వయసు, ఫిర్యాదులో జాప్యం తెలుసుకుని... ఎస్‌ఎల్‌పీ (SLP)ని కొట్టేస్తున్నట్లు ప్రకటించింది.

Continues below advertisement

2023 మే 30న హైదరాబాద్‌ ఐఎస్‌బీ (ISB) క్యాంపస్‌లోని స్టూడెంట్‌ అపార్ట్‌మెంట్‌లో ప్రథమ్‌సింగ్‌ అనే వ్యక్తి తనపై బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడినట్లు పిటిషనర్‌ 2025 డిసెంబరు 26న గచ్చిబౌలి పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై బీఎన్‌ఎస్‌ (BNS) సెక్షన్‌ 351(2), 69 కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడు ముందస్తు బెయిల్‌ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇద్దరి మధ్య పరస్పర ఆమోదయోగ్యమైన రిలేషన్ ఉన్నప్పటికీ, ఆమె తప్పుడు ఆరోపణలతో రెండున్నరేళ్ల తరువాత ఫిర్యాదు చేసినట్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విని, కేసు వివరాలు పరిశీలించిన హైకోర్టు 2026 మే 29న నిందితుడికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె తరఫున సీనియర్‌ లాయర్ మీనాక్షి అరోడా వాదనలు వినిపించారు. లైంగిక దాడి జరిగిన రెండున్నరేళ్ల తర్వాత ఫిర్యాదు చేశారని, కేసు దర్యాప్తు దాదాపు పూర్తయిందన్న కారణంతో హైకోర్టు బెయిల్‌ ఇచ్చిందని, కానీ అందులో నిజం లేదని కోర్టుకు తెలిపారు. వాదనలు వింటున్న జడ్జి జస్టిస్‌ సందీప్‌మెహతా జోక్యం చేసుకుని.. పిటిషనర్‌ ఎందుకు రెండున్నరేళ్ల ఆలస్యంగా ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. అందుకు వెల్లడించిన కారణాలను ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు లాయర్ బదులిచ్చారు. కానీ ఆ అంశంతో జడ్జి జస్టిస్‌ మెహతా ఏకీభవించలేదు. ఇంత జాప్యం జరిగితే ఎలా? ఈ పరిస్థితుల్లో క్రిమినల్‌ జూరిస్‌ప్రుడెన్స్‌ ప్రకారం ఏం చేయాలని ప్రశ్నించారు.

Continues below advertisement

అందుకు పిటిషనర్ తరఫు లాయర్ బదులిస్తూ.. అత్యాచారం తరహా ఘటనను నిందితుడు ఇదివరకే అంగీకరించినట్లు తమ వద్ద డిజిటల్‌ ఆధారాలున్నాయని కోర్టుకు చెప్పారు. జడ్జి మరోసారి స్పందిస్తూ ‘పిటిషనర్‌ వయసెంత’ అని ప్రశ్నించగా... నిందితుడికి 38 ఏళ్లు కాగా, పిటిషనర్‌ వేసిన మహిళకు 40 ఏళ్లు అని న్యాయవాది బదులివ్వగా... జస్టిస్‌ మెహతా వెంటనే స్పందిస్తూ ‘థాంక్యూ.. డిస్మిస్‌’ అని పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే నిందితుడు విదేశాలకు పారిపోకుండా అతని పాస్‌పోర్టును కోర్టులో డిపాజిట్‌ చేసేలా ఆదేశించాలని కోర్టును కోరారు.  దానిపై కింది కోర్టుకు వెళ్లే అవకావం ఇస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.