Sukesh Chandrasekhar Letter:మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరో లేఖను విడుదల చేస్తూ షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. ఈ లెటర్ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇందులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరుతో పాటు బీఆర్ఎస్ నేతల పేర్లను ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్.. జైలు నుండే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ రాశాడు. ఈ మేరకు 2 పేజీల లేఖను సుఖేశ్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ లెటర్ లో కేజ్రీవాల్ తో పాటు బీఆర్ఎస్ నేతలు పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇటీవల కేజ్రీవాల్ తో జరిపిన 703 వాట్సాప్ చాట్లలో టీజర్ గా ఒక చాట్ ను విడుదల చేస్తానని అన్నాడు. వచ్చే సోమవారం సీబీఐ, ఈడీకి మొదటి చాట్ ను ఇస్తానని లేఖలో పేర్కొన్నాడు.
15 కిలోల నెయ్యిని అసోసియేట్ ఏపీకి డెలివరీ చేయమన్న కేజ్రీవాల్
తాను మొదట విడుదల చేస్తున్న చాట్ తనకు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడికి మధ్య జరిగిందని పేర్కొన్నాడు సుఖేశ్. ఇందులో రూ. 15 కోట్లను కోడ్ భాషలో 15 కిలోల నెయ్యి అని పేర్కొన్నట్లు తెలిపాడు. 15 కిలోల నెయ్యిని ఒక అసోసియేట్ ఏపీ కి డెలివరీ చేయమని కేజ్రీవాల్ చెప్పినట్లు సుఖేశ్ పేర్కొన్నాడు. ఏపీ అంటే సౌత్ గ్రూపులోని అరుణ్ పిళ్లై. అతనికి రూ.15 కోట్లు ఇచ్చినట్లు సుఖేశ్ చంద్రశేఖర్ తెలిపాడు. బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీసులో పార్క్ చేసిన కారులో రూ.15 కోట్లు ఉంచానని, ఆ కారు ఓ రేంజో రోవర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ కారుకు 6060 నెంబర్ తో పాటు కారుపై ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉందని సుఖేశ్ తెలిపాడు. ఇప్పటికే 5 నెయ్యి కేసులు హైదరాబాద్‌కు పంపించినట్లుగా చెప్పారు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచనతో బీఆర్ఎస్ కార్యాలయంలో ఈ డబ్బును ముట్టజెప్పినట్లుగా సుఖేశ్ చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నాడు.
700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్ లు..!
బీఆర్ఎస్ నాయకుడి నేతృత్వంలో నడుస్తున్న సౌత్ గ్రూప్ కు, కేజ్రీవాల్ కు మధ్య ఉన్న సంబంధాన్ని బయట పెడతానని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను సుఖేశ్ లేఖలో వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన చాట్ బయటపెట్టగానే సౌత్ గ్రూప్ కు లీడర్ గా ఓ బీఆర్ఎస్ వ్యక్తి ఉన్న విషయం తెలుస్తుందని చెప్పాడు. ఆప్, బీఆర్ఎస్ నాయకుల మధ్య రహస్య అవగాహన ఉందంటూ తన లేఖలో షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు సుఖేశ్ చంద్రశేఖర్. తాను చెప్పిన విషయాలు నిజమని కావాలంటే తనకు నార్కొటిక్ టెస్టు చేసుకోవచ్చని సవాల్ విసిరాడు. దిల్లీ అరవింద్ కేజ్రీవాల్‌తో తాను చేసిన మొత్తం 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్‌లు చేశానని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో తెలిపారు. కేజ్రీవాల్‌కు 75 కోట్లు డెలివరీ చేసినట్లుగా సుఖేష్ తన లాయర్ ద్వారా ఒక లేఖను విడుదల చేశారు. కేజ్రీవాల్ నేను మీకు 2020కి సంబంధించిన చాట్ ట్రైలర్‌ను చూపించబోతున్నానని లేఖలో రాశాడు సుఖేశ్.