Sridhar Babu clarifies ministers did not hold secret meetings:  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో మంత్రుల భేటీపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రంగా స్పందించారు. లోక్ భవన్‌ నుంచి అందరి ముందే తామంతా ఒకే కారులో వెళ్లామని, అలా బహిరంగంగా వెళ్లినప్పుడు అది  రహస్య భేటీ  ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల భేటీకి రాజకీయ రంగులు పులుముతూ  విష ప్రచారం  చేయడం సరికాదని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు.

Continues below advertisement

మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన పార్టీ వ్యూహాలపై చర్చించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశమని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సన్నద్ధత అనేది రాజకీయ పార్టీల ప్రాథమిక బాధ్యత అని, దీనిపై చర్చించుకోవడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే కొందరు కావాలనే ప్రభుత్వంపై అసత్య ప్రచారాలకు ఒడిగడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలనలో సమన్వయం కోసమే తాము సమావేశమయ్యామని, క్యాబినెట్ అనేది ఒక యూనిట్ లాంటిదని మంత్రి వివరించారు. పాలనాపరమైన అంశాల్లో ఎక్కడా జాప్యం జరగకుండా చూడటం సీనియర్ మంత్రులుగా తమ బాధ్యత అని పేర్కొన్నారు. భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన చర్చలన్నీ కేవలం ప్రభుత్వం మరియు పార్టీ సమష్టి బాధ్యతలో భాగమేనని, ఇందులో దాపరికాలు ఏమీ లేవని ఆయన తేల్చి చెప్పారు.నిర్మాణాత్మకమైన విమర్శలను తాము ఎప్పుడూ స్వాగతిస్తామని, అయితే కేవలం ఊహాజనిత కథనాలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని శ్రీధర్ బాబు హెచ్చరించారు. భావితరాల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని అడ్డుకోకుండా, ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకుని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.  

Continues below advertisement

అసలేం జరిగిందంటే ? 

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సోమవారం రాత్రి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం దేశంలో లేని సమయంలో నలుగురు మంత్రులు సమావేశం కావడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. లోక్‌భవన్‌లో గవర్నర్‌ నిర్వహించిన ‘ఎట్‌ హోం’ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రులు అక్కడ నుండి నేరుగా ప్రజాభవన్‌కు వెళ్లారు. సీఎం రేవంత్ అమెరికాలో లీడర్ షిప్ కోర్సు చేసేందుకు వెళ్లిన సమయంలో మంత్రులు భేటీ కావడంతో ఏదో జరుగుతోందని ప్రచారం ప్రారంభమయింది.  దీనిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా స్పందించారు.   రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో నలుగురు మంత్రులు సమావేశం కావడంలో ఆశ్చర్యం లేదన్నారు. సీఎం అందుబాటులో లేనప్పుడు పాలనాపరమైన అంశాలపై మంత్రులు చర్చించుకోవడంలో తప్పులేదన్నారు.  ప్రభుత్వ యంత్రాంగం సజావుగా సాగడానికి మంత్రుల మధ్య సమన్వయం అవసరం. అందులో భాగంగానే భట్టితో ముగ్గురు మంత్రులు భేటీ అయ్యారని అభిప్రాయపడ్డారు.  ఈ అంశంపై భేటీలో పాల్గొన్న శ్రీధర్ బాబు క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రచారానికి తెరపడినట్లయింది.