Dharani Special drive in Telangana: ధరణి పోర్టల్‌లో పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana govenment)... ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. నేటి (మార్చి 1వ తేదీ) నుంచి... ఈనెల 9వ తేదీ వరకు.. ఈ డ్రైవ్ కొనసాగనుంది. ఇందు కోసం... తహశీల్దార్ నుంచి సీసీఎల్‌ఏ వరకు అధికార వికేంద్రీకరణ చేస్తూ నిన్న (గురువారం) మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. తహశీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)లకు అధికారాలను బదలాయించింది. ఏ స్థాయి అధికారికి ఏయే అధికారాలు ఉంటాయనేది మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది.
ధరణి పోర్టల్‌లో 2 లక్షల 45వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పట్టాదారు పాస్‌పుస్తకాల్లో డేటా కరెక్షన్ కోసం లక్షకుపైగా అప్లికేషన్లు ఉన్నాయి. 17 రకాల మాడ్యూల్స్ సవరణకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 2లక్షల 45వేలు. రికార్డుల అప్‌డేషన్ పేరుతో నిషేధిత జాబితా పార్ట్-బిలో 13 లక్షల ఎకరాలున్నాయి. కారణాలు లేకుండా నిషేధిత జాబితాలో 5 లక్షల ఎకరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో... ఈ పెండింగ్ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించనున్నారు అధికారులు.
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం... ప్రతి మండలంలో రెండు, మూడు బృందాలు ఏర్పాటు చేశారు. ఎమ్మార్వో ఆఫీసులో ఏర్పాటు చేసే బృందానికి తహసీల్దార్ గానీ డిప్యూటీ తహసీల్దార్ గానీ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు గానీ నేతృత్వం వహిస్తారు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. ఒకవేళ దరఖాస్తుదారుడు తగిన డాక్యుమెంట్లను సమర్పించకపోతే... వాటిని తెప్పించుకుంటారు. అవసరమైతే పొలాలు, స్థలాల దగ్గరకు వెళ్లి పరిశీలిస్తారు. డేటా కరెక్షన్లు ఉంటే... వెంటనే చేసేస్తారు. కాస్త పెద్ద సమస్య అయితే... ఒక నివేదిక రెడీ చేసి సీసీఎల్‌ఏకి పంపుతారు. ఆ సమస్య పరిష్కారం ఎంతవరకూ వచ్చిందో... వాట్సాప్ ద్వారా దరఖాస్తుదారులకు మెసెజ్‌లు పంపుతారు. సమస్య పరిష్కారం అయ్యాక... మొత్తం సమాచారాన్ని ఆన్‌లైన్‌లో భద్రపరుస్తారు.
దరఖాస్తుదారుడి భూమి విలువ 5 లక్షల రూపాయల లోపు ఉంటే ఆర్డీవో.. 5 లక్షల నుంచి 50 లక్షల లోపు ఉంటే కలెక్టర్లు, 50లక్షలకు పైబడి ఉంటే సీసీఎల్‌ఏ ఆ దరఖాస్తులను పరిష్కరిస్తారు. ఇందు కోసం వారికి కాలపరిమితి కూడా పెట్టారు. తహశీల్దార్ ఏడు రోజులు, ఆర్డీవో 3 రోజులు, అదనపు కలెక్టర్ 3 రోజులు, కలెక్టర్ ఏడు రోజుల్లో... పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంటుంది. ఆర్డీవో స్థాయి అధికారికి టీఎం 33లోని డేటా కరెక్షన్, మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణం, సర్వే నంబర్ల మిస్సింగ్‌ల పరిష్కార బాధ్యతలు అప్పగించారు. ఆర్డీవోలు తహసీల్దార్ ద్వారా విచారణ జరపాలి. తహసీల్దార్ ఇచ్చిన నివేదికలు, ఆర్డర్లను పున:పరిశీలించాలి. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే... అందుకు గల కారణాలను వివరించాలి. తహసీల్దార్, ఆర్డీవోల స్థాయిల్లో జరుగుతున్న పురోగతిని కలెక్టర్లు, జిల్లాల వారీ పురోగతిని సీసీఎల్‌ఏ (CCLA) పర్యవేక్షించాల్సి ఉంటుంది.
మొత్తంగా... ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దరఖాస్తుల పరిష్కారాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అధికారులు వారికి కేటాయించిన మాడ్యూళ్లలోని దరఖాస్తుల పరిష్కారంపై... తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పెండింగ్ దరఖాస్తు ఒక్కటి కూడా లేకుండా... సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం.