హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్న అధికారులు
నదీ తీరాలు, సరస్సులు, చెరువులు, కాలువల్లో మునిగిపోయే కేసులను తగ్గించడానికి, ప్రమాదకర నీటి వనరులున్న ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆ బోర్డుల వద్ద సహయం కోసం అత్యవసర నెంబర్ల సమాచారం ఉంచాలని సూచించారు. ఇటీవల గోదావరిలో మునిగి పలువురు గల్లంతయ్యారు. ఈతకు వెళ్లి కొందరు, స్నాసానికి వెళ్లి కొందరు ప్రమాదవశాత్తూ అందులో పడి గల్లంతయ్యారు.
తెలంగాణలో రెండు, మూడు రోజులపాటు వర్షాలు
తెలంగాణలో ఉపరితల ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదు కానున్నాయి. నేడు వర్ష సూచన ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. నేడు జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు (గాలి వేగం ) తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది.
మే 31 - జూన్ 7 వరకు రుతుపవనాలు చాలా బలహీనంగా మారతాయి. వర్షాలు సైతం తక్కువగా కురుస్తాయి. నేటి నుంచి రెండు రోజులపాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.