SCR Special Trains | హైదరాబాద్: శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 13వ తేదీ నుంచి జనవరి 2, 2026 తేదీ వరకు జోన్ పరిధిలోని పలు స్టేషన్ల నుంచి కేరళలోని కొల్లం జంక్షన్‌కు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
ఇందులో భాగంగా, చర్లపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, హజూర్‌సాహిబ్ నాందేడ్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. రానుపోను కలిపి మొత్తం 10 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టికెట్ల బుకింగ్ నేడు (డిసెంబరు 3వ తేదీన) ప్రారంభమవుతుందని వెల్లడించారు.
సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి కొల్లంకు శబరిమల ప్రత్యేక రైలు (నెంబర్ 07117) డిసెంబరు 13వ తేదీన బయల్దేరనుంది. ఈ రైలు బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం రైల్వే స్టేషన్లలో ఆగుతూ విజయవాడ, తిరుపతి మీదుగా కొల్లం చేరుకుంటుంది. చర్లపల్లి నుంచి కొల్లంకు మరో రెండు ప్రత్యేక రైళ్లు (నెంబర్లు 07119, 07121) డిసెంబరు 17, 20, 31 తేదీల్లో బయల్దేరతాయి. ఈ రైళ్లు సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్, తాండూరు స్టేషన్ల మీదుగా ప్రయాణించి గుంతకల్, చిత్తూరు, కాట్పాడి రూట్‌లో కొల్లం చేరుకుంటాయి.
డిసెంబర్ 15 నుంచి తిరుగు ప్రయాణానికి రైళ్లు
దాంతో పాటు హజూర్‌సాహిబ్ నాందేడ్ నుంచి కొల్లం వెళ్లే స్పెషల్ ట్రైన్ (నెంబర్ 07123) డిసెంబరు 24వ తేదీన బయల్దేరనుంది. ఈ స్పెషల్ ట్రైన్ నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, ఖమ్మం స్టేషన్ల మీదుగా ప్రయాణించి.. విజయవాడ, తిరుపతి, కొట్టాయం రూట్‌లో కొల్లం జంక్షన్‌కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. తిరిగి కొల్లం జంక్షన్ నుంచి చర్లపల్లికి డిసెంబరు 15, 19, 22, 26 అలాగే జనవరి 2వ తేదీల్లో ఈ ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయని ద.మ.రైల్వే మంగళవారం నాడు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.