BRSLP  Leader KCR   : బీఆర్ఎస్ శాసన సభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నికవనున్నారు. శనివారం ఉదయం తొమ్మిదిగంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ శాసనసభ్యులు సమావేశం కానున్నారు. ఈ సమావేశం వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సమావేశంలోనే పార్టీ శాసన సభా పక్ష నేతగా కేసీఆర్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అసెంబ్లీలో ను కేసీఆర్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు. మొదట కేసీఆర్ ఎల్పీ లీడర్ గా ఉండటం లేదన్న వార్తలు వచ్చాయి. కేటీఆర్ , హరీశ్ రావు లేదా కడియం శ్రీహరి ఎల్పీ లీడర్ గా ఎన్నికవుతారని , అసెంబ్లీలో పార్టీని నడిపిస్తారని వార్తలు వచ్చాయి. కాని అసెంబ్లీలో అధికార పార్టీని దీటుగా అడ్డుకునేందుకు కేసీఆరే బరిలోకి దిగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


కేసీఆరే బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఉండాలనుకుంటు న్న ఎమ్మెల్యేలు                                             


ఆయన హాజరు కాలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కేసీఆర్ నే తమ నేతగా ఎంపిక చేసుకోవాలని ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారని ఆ  పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి కేసీఆర్ నేతృత్వంలోనే ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. రెండు నెలల వరకూ.. అసెంబ్లీలో సమావేశాలు జరిగితే.. ఉపనేతలుగా ఎన్నికయ్యే వారు బాధ్యతలు నిర్వహిస్తారు. అధికారికంగా ప్రతిపక్ష నేతగా మాత్రం కేసీఆరే ఉంటారు. 


  కేటీఆర్ వర్కింగ్ ప్రతిపక్ష నేత !                  


కేసీఆర్ ఇక పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టాలని అనుకున్నారని.. కేటీఆర్ కు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు ఇవ్వాలనుకుంటున్నారని రెండు రోజులుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతీకార రాజకయాలకు పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ ఉండటమే మంచిదన్న వాదన ను కొంతమంది సీనియర్ నేతలు వినిపించినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ కూడా.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎలాగూ.. జాతీయ రాజకీయాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నందున... అప్పుడే ఎమ్మెల్యే పదవికి.. ప్రతిపక్ష నత పదవికి కూడా రాజీనామా చేయవచ్చునని.. ఇప్పటికైతే తానే ఉండటం మంచిదని ఆయన నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. 



పూర్తి సమయం పార్టీ బలోపేతం కోసం కేటాయించే అవకాశం                            


ప్రస్తుతానికి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. ఆయన రెండు నెలల పాటు ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లోనూ పాల్గొనే అవకాశం లేదు. పదేళ్లుగా అవిశ్రాంతంగా కష్టపడినందున.. మరో రెండు నెలల పాటు ఆయనను విశ్రాంతిగా ఉండనివ్వాలని కుటుబంసభ్యులు కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. విశ్రాంతిలో ఉన్నా.. పార్లమెంట్ ఎన్నికల కోసం ఆయన వ్యూహాలు సిద్ధం చేసే అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వ బాధ్యతల కారణంగా పార్టీపై పెద్దగా దృష్టి పెట్టే పరిస్థితి ఉండేది కాదు. ఈ సారి పూర్తిగా పార్టీపైనే దృష్టి కేంద్రీకరించనున్నారు.