Selfish Son: నవమాసాలు మోసి భూమి మీదకు అడుగుపెట్టేలా తల్లి చేస్తే.. మిగతా భారమంతా తండ్రి మోస్తాడు. పాతికేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకుని తన కాళ్ల మీద తాను నిలబడేలా చేస్తాడు. ఇందు కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. కానీ ఆ కొడుకు తండ్రి త్యాగాన్ని గుర్తించకుండా ఆస్తులు ఇవ్వలేదని తలకొరివి కూడా పెట్టాడానికి నిరాకరిస్తే ఇక ఆ కుమారుడి జన్మకు ఏం అర్థం ఉంటుంది. ఇలాంటి ఓ వ్యక్తి నిజంగానే ఉన్నాడు.                                                      

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్ పల్లెకు చెందిన మాణిక్యరావు గతంలో సర్వేల్యాండ్ రికార్డ్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. రిటైర్ అయిన తర్వాత ఆయన మహబూబ్ నగర్‌లోనే నివాసం ఉంటున్నాడు.  సొంత ఊరిలో 16 ఎకరాలు వ్యవసాయం పొలం ఉంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఇల్లు ఉంది.                              

మాణిక్యరావుకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.  కొంతకాలం క్రితం భార్య కన్నుమూసింది. తన ఆరోగ్యం కూడా  బాగోలేకపోవడంతో ఆస్తులు పంచేశాడు.  సొంత ఊరిలో ఉన్న వ్యవసాయ పొలంతో పాటు రూ 60 లక్షల నగదును కుమారుడు గిరిష్‌కు రాసిచ్చాడు.    మహబూబ్ నగర్‌లో ఉన్న ఇంటిని కూతురు రాజనందిని పేరిట రిజిస్టర్ చేయించి ఇచ్చారు. కుమారుడు గిరిష్ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. గత కొంతకాలంగా మాణిక్యరావు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కూతురు ఇంటిలోనే ఉంటున్నారు.   అనారోగ్యం కారణంగా బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని కూతుళ్లు తమ తమ్ముడైన గిరీష్‌కు సమాచారం ఇచ్చారు.                  

అయితే మహబూబ్ నగర్‌లోని ఇంటిని కూడా తనకు రాసివ్వనందుకు గిరీష్ తండ్రిపై కోపం తెచ్ుకున్నారు.  హైందవ సాంప్రదాయ ప్రకారం కర్మకాండలు నిర్వహించాల్సిన కుమారుడు  రానని తెగేసి చెప్పాడు. మహబూబ్ నగర్‌లో ఉన్న ఇంటిని తన పేరిట రిజిస్టర్ చేసి పది తులాల బంగారం ఇస్తేనే వస్తానని షరతు పెట్టాడు. బంధువులు, కాలనీవాసులు కూడా గిరిష్‌కు చెప్పి చూశారు. జన్మనిచ్చి .. ప్రయోజకుడ్ని చేసి ఆస్తి కూడా రాసిచ్చిన తండ్రికి  అంత్యక్రియలు చేయకపోవడం మహా పాపమని అన్నారు. అయినా గిరీష్  గుండె కరగలేదు.  దీంతో చిన్న కూతురు రఘునందిని ముందుకు వచ్చి తన తండ్రి అంత్యక్రియలు తానే నిర్వహించింది.  తండ్రి అంతిమ యాత్ర ముందు నడిచి స్మశానంలో అన్ని తానై తండ్రి అంత్యక్రియలను జరిపించింది. ఇలాంటి కుమారుడ్ని కన్నందుకు మాణిక్యరావుకు కనీసం తలకొరివి పెట్టలేదని గిరీష్ పై అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.