అవినీతి అనే పదానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కవల పిల్లలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె దుబ్బాకలో మాట్లాడారు. సిద్ధిపేట, కరీంనగర్, వరంగల్ పట్టణాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడానికి ప్రధాని మోదీ వేల కోట్లు మంజూరు చేశారని, సిద్ధిపేటకు రైలు తెచ్చారని, పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు కట్టించిన ఘనత మోదీదేనని అన్నారు. టెక్స్ టైల్ పార్క్ మంజూరు చేశారని, రామంగుండం ఫెర్టిలైజర్ కంపెనీ ఓపెన్ చేసి ఎరువుల కొరత తీర్చారని వివరించారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు.


గల్లీలో కొట్లాట.. ఢిల్లీలో ఒప్పందాలు


కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, బీఆర్ఎస్ కు ఓటేసినట్లేనని అన్నారు. కేసీఆర్, రాహుల్ గాంధీ తెలంగాణలో కొట్లాడి, ఢిల్లీలో కలిసికట్టుగా చీకటి ఒప్పందాలు చేసుకుంటారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని, ఆ ఆకాంక్ష నెరవేరలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డగోలుగా వ్యయం పెంచి పూర్తి చేశారన్నారు. అయినా, 60 శాతం భూములకు నీళ్లు అందడం లేదని ధ్వజమెత్తారు. పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లు అప్పు చేసిందని వ్యాఖ్యానించారు. 


లీకులతో యువతకు అవస్థలు


ఉద్యోగ నియామకాల విషయంలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే న్యాయం జరిగిందని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. TSPSC ప్రశ్నపత్రాల లీకులతో యువత జీవితాలను చీకటిలో పడేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చెప్పేదొకటి, చేసేదొకటని అన్నారు. రాష్ట్రంలో జరిగిన అనేక కుంభకోణాల్లో కేసీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. మోసం చేసిన కేసీఆర్ వైపు ఉంటారో, అభివృద్ధి చేసే ప్రజల వైపు ఉంటారో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు.