SIT questioned KTR for seven hours:  తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో  జూబ్లీహిల్స్ ఏసీబీ కార్యాలయంలో సిట్ (SIT) అధికారులు  కేటీఆర్‌ను సుమారు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ  రాధాకిషన్ రావు ను, కేటీఆర్‌ను ముఖాముఖి కూర్చోబెట్టి ప్రశ్నించడం. ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా రాజకీయ నేతలు, సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరి ఆదేశాల మేరకు ఈ వ్యవస్థ పనిచేసింది? అనే కోణంలో అధికారులు ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. 

విశ్వసనీయ సమాచారం ప్రకారం, సిట్ అధికారులు కేటీఆర్ ముందు సుమారు 20 కీలక ప్రశ్నలను ఉంచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కమాండ్ స్ట్రక్చర్, హార్డ్ డిస్క్‌ల ధ్వంసం, డిజిటల్ సాక్ష్యాల ఆధారంగా విచారణ సాగింది.  ముఖ్యమైన వ్యక్తుల ఫోన్లు ఎవరి సూచనలతో ట్యాప్ అయ్యాయి? సేకరించిన సమాచారాన్ని ఎవరికి చేరవేశారు? వంటి ప్రశ్నలకు కేటీఆర్ నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. 

విచారణాధికారులు కేటీఆర్‌కు , నిందితులకు మధ్య ఉన్న సంబంధాలపై కూడా దృష్టి పెట్టారు. రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ జరుగుతున్నంత సేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. హరీష్ రావు విచారణ ముగిసిన రెండు రోజులకే కేటీఆర్‌ను పిలవడం, అది కూడా నిందితుడితో కలిపి విచారించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.