SIT issues notice to Harish Rao in phone tapping case: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం , మొదటిసారిగా బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 10:30 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు పాత్రపై సిట్ అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది.
ఈ కేసులో అరెస్టయిన నిందితులు , ఒక ప్రముఖ టీవీ ఛానల్ యజమాని ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఈ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. సదరు ఛానల్ ఎండీతో కలిసి హరీష్ రావు కొందరి ఫోన్లను ట్యాప్ చేయించారనే ఆరోపణలపై సిట్ ఆరా తీస్తోంది. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ ప్రత్యర్థుల కదలికలను గమనించేందుకు ఎస్ఐబీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను విచారించిన సిట్, ఇప్పుడు నేరుగా రాజకీయ నేతలను రంగంలోకి దించడం ఉత్కంఠ రేపుతోంది.
హరీష్ రావుకు నోటీసులు అందడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హరీష్ రావు విచారణ అనంతరం మరికొంత మంది ముఖ్య నేతలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌లకు కూడా త్వరలోనే నోటీసులు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలోనే ఈ అంశంపై ప్రచారం జరిగింది. తాజా పరిణామాలతో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
ఇటీవల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుపై నమోదైన కేసును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తున్న కేసుకు.. ఆ కేసుకు సంబంధం లేదు. సిద్ధిపేటకు చెందిన చక్రధర్ రావు అనే వ్యక్తి తన ఫోన్ ను ట్యాపింగ్ చేయించారని చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు అది. ఇప్పుడు నేరుగా సిట్ దర్యాప్తు చేస్తున్న కేసులో నోటీసులు ఇచ్చారు. మంగళ వారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద హరీష్ రావు హాజరయ్యే అవకాశం ఉందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఇవాళ రాత్రి నోటీసులు ఇచ్చి తర్వాత రోజే రావాలంటే ఎలా అని ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే హరీష్ రావు మాత్రం ఇలాంటి వాటిని రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కొంటారని.. విచారణకు హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.