SIT Chief Sajjanar makes key statement on KTR investigation:  ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె. టి. రామారావు  సిట్ విచారణకు హాజరైన అంశంపై సిట్ చీఫ్ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు.  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ముందు హాజరైన ఆయనను సిట్ బృందం సుదీర్ఘంగా ప్రశ్నించి, కీలక అంశాలపై వివరాలను సేకరించింది. కేసులోని వివిధ కోణాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఇప్పటికే అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలతో కేటీఆర్ ఇచ్చిన సమాధానాలను విశ్లేషిస్తున్నామని సిట్ చీఫ్ సజ్జనార్ వెల్లడించారు. విచారణకు సహకరించిన కేటీఆర్‌కు.. సాక్షులను ప్రభావితం చేయవద్దని సూచించామని, అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని స్పష్టం చేశారు.

Continues below advertisement

ఈ విచారణ కేవలం క్రైమ్ నంబర్ 243/2024 కు సంబంధించి, వేలాది మంది సామాన్య పౌరులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్లను అక్రమంగా, అనధికారికంగా ట్యాపింగ్ చేసిన ఆరోపణల మీదనే సాగిందని సజ్జనార్ చెప్పారు.  దర్యాప్తు సంస్థలు చట్టప్రకారం, అత్యంత వృత్తిపరంగా తమ పనిని నిర్వహిస్తున్నాయని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రతి అంశాన్ని నిష్పాక్షికంగా విచారిస్తున్నామని, చట్టం ముందు అందరూ సమానులేనని ఆయన స్పష్టం చేశారు. 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం భద్రతా కారణాల దృష్ట్యా జరిగిందని, ఇందులో ఎటువంటి చట్టవిరుద్ధత లేదంటూ కొన్ని మీడియా సంస్థలు,  వ్యక్తులు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. విచారణల అంశంపై బయట జరుగుతున్న ప్రచారానికి సిట్ కు సంబంధం లేదన్నారు.  ఇటువంటి నిరాధారమైన, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం దర్యాప్తును పక్కదారి పట్టించడమేనని సజ్జనార్ మండిపడ్డారు. దర్యాప్తు సంస్థకు ఇలాంటి తప్పుడు కథనాలతో ఎలాంటి సంబంధం లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న వాదనలను పరిగణనలోకి తీసుకోబోమని తేల్చి చెప్పారు.    

Continues below advertisement

ప్రజలు ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, కేవలం అధికారిక మార్గాల ద్వారా వెల్లడయ్యే వాస్తవాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. దర్యాప్తుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు చట్టబద్ధంగా వెల్లడిస్తామని, సోషల్ మీడియాలో లేదా ఇతర వేదికలపై వస్తున్న ఊహాజనిత వార్తలను వ్యాప్తి చేయవద్దని ఆయన కోరారు. దర్యాప్తు నిష్పాక్షికంగా కొనసాగుతుందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఈ ప్రెస్ స్టేట్‌మెంట్ ద్వారా స్పష్టం చేశారు.