SIT agrees to give time for KCR investigation:  తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో గురువారం చోటుచేసుకున్న పరిణామాలు అత్యంత వేగంగా, నాటకీయంగా సాగాయి.   గురువారం ఉదయం సిట్  అధికారులు నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేయడంతో మొదలైన ఈ ప్రక్రియ, సాయంత్రానికి కేసీఆర్ ఇచ్చిన ఘాటైన సమాధానంతో కొత్త మలుపు తీసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని పోలీసులు కోరగా, కేసీఆర్ మాత్రం తన లిఖితపూర్వక సమాధానంలో చట్టపరమైన అంశాలను ప్రస్తావిస్తూ  నో చెప్పారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం చివరి దశలో ఉండటంతో తానే అభ్యర్థులకు బి-ఫారాలు కేటాయించాల్సి ఉందని, అందుకే హాజరుకాలేనని స్పష్టం చేశారు.

Continues below advertisement

చట్టబద్ధమైన మెలిక - ఎర్రవల్లి వర్సెస్ జూబ్లీహిల్స్                           

కేసీఆర్ తన సమాధానంలో కేవలం ఎన్నికల బిజీనే కాకుండా, చట్టంలోని కీలక నిబంధనలను గుర్తు చేశారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు పిలవకూడదని, వారి నివాసంలోనే విచారించాలని ఉన్న నిబంధనను ఆయన తన రక్షణ కవచంగా మార్చుకున్నారు. తాను ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే నివసిస్తున్నానని, అక్కడికే వచ్చి విచారించుకోవచ్చని ఆయన ఆఫర్ ఇచ్చారు. దీంతో పోలీసులు ఆయనను జూబ్లీహిల్స్ ఏసీబీ కార్యాలయానికి రప్పించాలనే ప్రాథమిక ఆలోచనను తాత్కాలికంగా పక్కన పెట్టాల్సి వచ్చింది.

Continues below advertisement

న్యాయ సలహా తర్వాతే సిట్ తదుపరి అడుగు                                   

కేసీఆర్ ఇచ్చిన సమాధానం కేవలం సమాచారం మాత్రమే కాదు, అందులో లోతైన న్యాయపరమైన అంశాలు ఉన్నాయి. ఆయన నివాస స్థలం ఎక్కడ? విచారణ ఎక్కడ జరపాలి? అనే విషయాలపై స్పష్టత కోసం సిట్ అధికారులు ఇప్పుడు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. శుక్రవారం విచారణ ఉండదని  స్పష్టమైపోయింది. సిట్ ఈ మేరకు కేసీఆర్ కు సమాచారం ఇచ్చింది. అయితే, తదుపరి నోటీసులు ఎప్పుడు ఇస్తారు? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకునే లోపే విచారణ ముగించాలని ప్రభుత్వం భావిస్తుందా, లేక ఎన్నికల తర్వాతే దీనిపై దృష్టి పెడుతుందా అనేది వేచి చూడాలి.

 రాజకీయంగా ఎవరికి లాభం?                           

బీఆర్ఎస్ ఈ నోటీసులను రాజకీయ కక్షసాధింపుగా మలిచి సానుభూతి పొందాలని చూస్తుంటే, కాంగ్రెస్ మాత్రం అక్రమాలను బయటపెడుతున్నామనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. నామినేషన్ల చివరి రోజైన శుక్రవారాన్ని కేసీఆర్ ఎంచుకోవడం వెనుక, క్యాడర్‌లో నైతిక బలాన్ని పెంచే ఉద్దేశం కూడా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి, విచారణ వాయిదా పడటం అనేది ప్రస్తుతానికి కేసీఆర్‌కు తాత్కాలిక ఊరటనిచ్చినప్పటికీ, సిట్ మాత్రం ప తదుపరి నోటీసుల కోసం రంగం సిద్ధం చేస్తోంది.