MLA Palwai Harishbabu Distributing Checks: కాగజ్ నగర్ (Kagaznagar) అటవీ ప్రాంతాల్లోని పులుల సంరక్షణలో అటవీ శాఖ అధికారులకు అందరూ సహకరించాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు (Palwai HarishBabu) అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం వంజిరి గ్రామంలో మంగళవారం అటవీ అధికారుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పులి దాడిలో మరణించిన పశువుల యజమానులకు చెక్కులు పంపిణీ చేశారు.


'అలాంటి చర్యలకు పాల్పడొద్దు'


పులులకు క్రిమి సంహారక మందులు, కరెంట్ వైర్లు పెట్టి అంతమొందించడం దారుణమని ఎమ్మెల్యే పాల్వాయి అన్నారు. తమ పశువులను దాడి చేసి చంపేస్తున్నాయనో.. తమపై దాడి చేస్తున్నాయనే భయంతో రైతులెవరూ ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడవద్దని సూచించారు. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే, పోడు రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న అటవీ భూముల విషయంలోనూ అటవీ అధికారులు వారిని ఇబ్బంది పెట్టడం మానుకోవాలని సూచించారు. వారి జీవన భృతి విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. ఉన్న భూమిని వదిలేది లేదు, కొత్త భూమిని కొట్టేది లేదు అనే నినాదాన్ని గ్రామస్థులు, రైతులు, అటవీ శాఖ అధికారులు అమలు చేయాలని చెప్పారు.


వారికి చెక్కుల పంపిణీ


అనంతరం పులి దాడిలో చనిపోయిన పశువుల యజమానులకు చెక్కుల పంపిణీ, స్కూల్ పిల్లలకు అటవీ శాఖ అధికారుల అధ్వర్యంలో బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీ నీరజ్ కుమార్, జెడ్పీ ఇంఛార్జీ ఛైర్మన్ కోనేరు కృష్ణ రావు, రూరల్ సీఐ నాగరాజు, FRO రమాదేవి, ఎస్ఐ సానియా, సర్పంచ్ లు ముంజం రమేష్, పుల్ల అశోక్, జంగు, లబ్దిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు. 


Also Read: Congress Manifesto Committee : తెలంగాణ మేనిఫెస్టో కీలక హామీలతోనే లోక్‌సభ ఎన్నికలకు - ఏఐసీసీ పరిశీలన !