Mancherial Singareni Medical Unfit Job Letters:  తెలంగాణ ప్రజల నల్ల బంగారమైన సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమంలో తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. వైద్య పరంగా సేవలు అందించలేని సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఈ వేదికగా ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. సింగరేణి సంస్థ అనేది తెలంగాణ ప్రజల సొంత ఆస్తి అని, ప్రజాస్వామ్య రక్షణలో తాము ఎల్లప్పుడూ జాగరుకతతో ఉంటూ సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు.

Continues below advertisement

ఈ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వైద్యపరంగా పనిచేయలేని స్థితిలో ఉన్న సింగరేణి ఉద్యోగుల వారసులలో.. పూర్తిస్థాయి అర్హత కలిగిన 335 మంది అభ్యర్థులకు మంత్రుల హస్తాల మీదుగా ఉద్యోగ పత్రాలు లభించాయి. ఇందులో అత్యధికంగా 117 మంది కేవలం మంచిర్యాల జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరికొంత మంది అర్హులను గుర్తించి నియామక పత్రాలు అందజేస్తామన్నారు. అంతేకాకుండా, మంచిర్యాల జిల్లా పరిధిలో రూ.70 కోట్లతో గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు, రూ.74.40 కోట్లతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు తాము శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు.  సింగరేణి కార్మికులకు రూ. 1 కోటి 25 లక్షల భారీ బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, అలాగే సంస్థలో పనిచేస్తున్న 30 వేల మంది ఒప్పంద, పొరుగు సేవల  సిబ్బందికి కూడా బోనస్ అందించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సింగరేణి లాభాల్లో కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా ఒప్పంద కార్మికులకు కూడా వాటా అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. మెడికల్ అన్‌ఫిట్ నియామకాల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. రెగ్యులర్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ సిబ్బందికి కూడా రూ. 40 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించామని పేర్కొన్నారు. కోల్ బ్లాకుల్లో పూర్తి నిఘా వ్యవస్థ మధ్య పనులు జరుగుతున్నాయని, తెలంగాణ సహజ వనరులను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.    

 సింగరేణిలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న  మారుపేరు  సమస్య పరిష్కారానికి త్వరలోనే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రకటించారు.   అలాగే పదవీ విరమణ పొందిన కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు అందజేశామని చెప్తూ.. ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను వారికే కేటాయించి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వర్తింపజేయాలని, శ్రీరాంపూర్ పరిధిలోని అర్హులకు పట్టాలు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, 1992లో సింగరేణి సంస్థను రూ.450 కోట్లకు బీఐఎఫ్ఆర్  పరిధిలోకి పంపకుండా ఆనాడు కాపాడింది గడ్డం వెంకటస్వామి నని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.