Harish Rao News: సిద్ధిపేట లోని తన అధికారిక నివాసంపై కాంగ్రెస్  గూండాలు దాడి చేసి, ప్రభుత్వ ఆస్తికి నష్టం చేకూర్చారని  బీఆర్ఎస్  సీనియర్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు.  పోలీసులు వారి చర్యలకు కొమ్ముకాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు ‘జై కాంగ్రెస్’ నినాదాలు చేస్తూ గేటు తోసుకుంటూ లోపలికొచ్చి తన క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీని చించి వేస్తున్నట్లు ఉన్న దృశ్యాలను ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేసిన ఆయన ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై, తెలంగాణ పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. 


‘‘సిద్ధిపేట ఎమ్మెల్యే  అధికారిక నివాసంపై కాంగ్రెస్ గూండాలు అర్థరాత్రి దాడి చేయడం రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులకు నిదర్శనం.   తాళాలను పగలగొట్టడం, ఆస్తులను ధ్వంసం చేయడం అప్రజాస్వామికం. ఇలాంటి చర్యలు రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితులపై ప్రశ్నలకు తావిస్తున్నాయి.   ఇలాంటి దాడులను అడ్డుకోవాల్సిన పోలీసులు ఉద్దేశ పూర్వకంగా అల్లరి మూకలకు కొమ్ము కాస్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఇంటినే ఈ  తరహాలో లక్ష్యం చేసుకుని రెచ్చిపోతోంటే. సాధారణ పౌరుల రక్షణకు ఈ ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తోంది? పోలీసులు సమక్షంలోనే  ఇలా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి అరాచకాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర డీజీపీని కోరుతున్నాం’’ అని ఆయన ట్వీట్ చేశారు.


మరోవైపు దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సైతం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘సీనియర్ శాసన సభ్యుడు, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నివాసంపై కాంగ్రెస్ గూండాల దాడిని  తీవ్రంగా ఖండిస్తున్నాం.  గత పదేళ్లుగా తెలంగాణలో రాజకీయ హింస జరగలేదు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకూ ఆస్కారం ఇవ్వలేదు.  కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల సహకారంతో రాజకీయ హింసను ప్రేరేపిస్తోంది. కాంగ్రెస్ చేస్తోన్న ఈ కిందిస్థాయి, థర్డ్ గ్రేడ్ రాజకీయాన్ని పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారు. కచ్చితంగా దీనికి భవిష్యత్తులో ధీటైన జవాబిస్తాం’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.  దాడికి సంబంధించిన వీడియోలను సైతం పోస్టు చేశారు.