YS Sharmila : దేశంలోనే అతి పెద్ద స్కాం కాళేశ్వరం అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఢిల్లీలో కాగ్‌కు ఫిర్యాదు చేసి వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో దాదాపు రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ను రూ.38 వేల కోట్లతో చేపడితే.. ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో సీఎం కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని షర్మిల విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డి తోడు దొంగలైతే.. బండి సంజయ్, రేవంత్ రెడ్డి జీతగాళ్లని షర్మిల కామెంట్ చేశారు. ప్రాజెక్ట్లో జరిగిన అవినీతిపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
మేఘా కృష్ణారెడ్డితో అందరూ కుమ్మక్కయ్యారన్న షర్మిల
మేఘా కృష్ణారెడ్డి అనే వ్యక్తి కేసీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి, మీడియా సహా అందరినీ మేనేజ్ చేస్తున్నాడని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి జరిగిందని పదేపదే ఆరోపణలు చేసే బీజేపీ.. కేసీఆర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో భారీ అవినీతి జరిగినా వైఎస్సార్టీపీ తప్ప ఇంకే పార్టీ ఆ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల డబ్బును కేసీఆర్ బందిపోటులా దోచుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతిపై కేంద్రం ఎంక్వైరీ కమిషన్ వేయాలని షర్మిల డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని అనుకోవాల్సి వస్తుందని అన్నారు. విభజన హామీలు నెరవేర్చని బీజేపీ మునుగోడులో సిగ్గులేకుండా ఓట్లు అడుగుతోందని షర్మిల ఫైర్ అయ్యారు.
గతంలో సీబీఐ, తెలంగాణ గవర్నర్‌కూ ఫిర్యాదు
గతంలో సీబీఐ డైరక్టర్‌ను కలిసి షర్మిల ఫిర్యాదు చేసారు. కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు జరుపుతామని సీబీఐ, కాగ్ హామీ ఇచ్చాయని షర్మిల చెప్పారు. కాళేశ్వరంలో అవినీతిపై షర్మిల చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. గత ఆగస్టులో గవర్నర్ తమిళిశైను కూడా కలిసి ఫిర్యాదు చేశారు. అన్నీ ఆధారాలు గవర్నర్‌కు ఇచ్చానని చెప్పారు. అప్పట్నుంచి వివిధ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. స్వయంగా వెళ్లి ఆధారాలు కూడా ఇస్తున్నట్లుగా వైఎస్ఆర్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో దాదాపుగా అన్ని పార్టీలు కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే అన్ని పార్టీలూ ఆరోపణలకే పరిమితం కాగా.. షర్మిల మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారు. తక్షణం విచారణ జరపాలని కోరుతున్నారు.
ఏపీలోనూ పలు కీలక ప్రాజెక్టులు చేపట్టిన మేఘా
మేఘా కృష్ణారెడ్డికి చెందిన సంస్థలకే తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులూ దక్కుతున్నాయని తెలంగాణ ప్రజల సంపద.. మేఘా పరం అవుతోందని.. షర్మిల ఆరోపిస్తున్నారు. ఆమె ఈ విషయంలో ఇతర సమస్యల కన్నా ఎక్కువగా పోరాటం చేయడం రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది. మేఘా కృష్ణారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సన్నిహితంగా ఉంటారు. ఏపీలోనూ రివర్స్ టెండర్ల ద్వారా అత్యధిక కాంట్రాక్టులు మేఘా సంస్థకే దక్కాయి.