సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని అమర్‌ల్యాబ్‌ రసాయన పరిశ్రమలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు రియాక్టర్‌లు పేలిన ఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న 11 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది 3 ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది బాచుపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 


కి.మీ వరకూ పొగలు


ఒక్కసారిగా రియాక్టర్లు పెద్ద శబ్ధంతో పేలినట్లు కార్మికులు తెలిపారు. ప్రమాదం తర్వాత చుట్టుపక్కల ఓ కి.మీ వరకూ దట్టమైన పొగలు అలుముకోవడంతో అంతా ఆందోళన చెందారు. కాగా, అమర్ ల్యాబ్ పరిశ్రమలో గతంలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగిందని స్థానికులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రస్తుత ప్రమాదంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.


మెహిదీపట్నంలోనూ


మరో ఘటనలో హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఓ అపార్టుమెంట్ లోనూ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంపీరియల్ ప్లాజాలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగగా నివాస గృహం పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. భవనంలో భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 


షార్ట్ సర్క్యూటే కారణం


ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్ మెంట్ ను మరోసారి తనిఖీ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాలేదని వెల్లడించారు. 


హౌరాలోనూ భారీ అగ్ని ప్రమాదం


పశ్చిమబెంగాల్ హౌరాలోనూ శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇండస్ట్రియల్ పార్కులోని వేర్ హౌజ్ లో అగ్ని ప్రమాదం జరగ్గా, మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి పొగలు దట్టంగా అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత లేదు. నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు.