Tonique Shop :  హైదరాబాద్‌లో మద్యం మాల్ టానిక్ దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు.  జూబ్లీహిల్స్ లోని టానిక్ వైన్ షాప్ లో  30 మంది అధికారులతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.  వైన్ షాప్ లోని ఎమ్మార్పీ రేట్లు , అమ్మతున్న రేట్లను పరిశీలించారు.  ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్ మెంట్ , జీఎస్టీ అధికారులు కూడా ఈ సోదాల్లో పాల్గొన్నారు.  
ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కురుషి ఆధ్వర్యంలో .. అడిషనల్ ఎస్పీ భాస్కర్ గౌడ్ ఐదుగురు డీఎస్పీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోదాలు జరుగుతున్నాయి.  హైదరాబాద్ లో ఉన్న 11 షాప్ లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 


ఒక్క టానిక్ దుకాణాలకే ఎలైట్ లైసెన్స్ 


టానిక్ మద్యం దుకాణాల తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్‌ లిక్కర్ గ్రూప్స్‌ (Tonic Liquor Groups) కు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  టానిక్‌ గ్రూప్స్‌కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు.  రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్‌ బ్రాండ్‌కు గత ప్రభుత్వంలో అధికారులు కేటాయించారు. ఇది ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ముందుగా పాలసీలో ఇలాంటి అనుమతి నోటిఫై చేయలేదని అంటున్నారు. 


మొత్తం 11 టానిక్ దుకాణాలు


హైదరాబాద్‌లో టానిక్‌ లిక్కర్ గ్రూప్స్‌కు 11 ఫ్రాంచైజ్‌లు ఉన్నాయి. క్యూ బై టానిక్ పేరుతో సదరు సంస్థ మద్యం విక్రయాలు చేస్తోంది. జీఎస్టీ అధికారుల తనిఖీల్లో టానిక్‌ గ్రూప్స్‌కు సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 11 క్యూ టానిక్ సిండికేట్లను అనిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి అనే వ్యక్తులు నడిపించినట్లు అధికారులు గుర్తించారు. టానిక్‌ లిక్కర్ గ్రూప్స్‌ సిండికేట్‌కు సంబంధించి బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్‌లో ముగ్గురు ఉన్నతాధికారుల కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. మాజీ సీఎంవో అధికారి భూపాల్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, ఎక్స్‌జ్ ఉన్నతాధికారి కూతురు, మరో అడిషనల్ ఎస్పీ కూతురు ప్రియాంక రెడ్డిలకు టానిక్‌ లిక్కర్ గ్రూప్స్‌ సిండికేట్‌‌లో భాగస్వామ్యం ఉన్నట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు.


పెద్ద ఎత్తున పన్నలు ఎగ్గొట్టినట్లుగా గుర్తింపు


ప్రభుత్వానికి రావాల్సిన వ్యాట్​ను ఎగ్గొట్టినట్లు తమ సోదాల్లో నిర్ధారించారు. ఇన్​వాయిస్​ బిల్లులలో వ్యాట్​ రాకుండా సర్కారు ఖజానా సొమ్మును కొల్లగొట్టినట్లు తేల్చారు. ప్రభుత్వానికి రావాల్సింది ఎంత మొత్తంలో ఎగ్గొట్టారనే దానిపై అధికారులు లెక్కలు తీస్తున్నారు.  రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచైనా రకరకాల మద్యం బ్రాండ్లను తెప్పించుకునే వెసులుబాటు టానిక్ కు ఉంది. దీన్ని ఉపయోగించి.. అత్యంత ఖరీదైన మద్యాన్ని విదేశాల నుంచి తెప్పించి .. పన్నులు ఎగ్గొట్టి అమ్మినట్లుగా భావిస్తున్నారు.  ఇన్నేళ్ల నుంచి వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొడుతున్నా ఎక్సైజ్ శాఖ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పట్టించుకోకపోవడానికి గల కారణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. టానిక్ ఎలైట్ వైన్ షాప్ వెనుక గత బీఆర్ఎస్‌ ప్రభుత్వంలోని ముఖ్య నేతలు ఉండడంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. ఏడేళ్ల పాటు మద్యం విక్రయాల లెక్క తీస్తే ఎంత ట్యాక్స్ ఎగ్గొట్టారో బయట పడుతుందని జీఎస్టీ అధికారులు పేర్కొన్నారు.