2nd August 2024 School News Headlines Today:
క్రీడా వార్తలు
మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ కుసాలే భారతదేశానికి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు. పారిస్ ఒలింపిక్స్‌లో స్వప్నిల్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌లో కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. విజేత స్వప్నిల్ కుసాలేకు ఫోన్ చేసి అభినందించారు. భారత్‌కు పారిస్ ఒలింపిక్స్‌లో మూడో కాంస్య పతకం రావడంతో క్రీడా అభిమానుల్లో ఆనందం నెలకొంది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. లక్ష్య 21-12, 21-6తో స్వదేశానికి చెందిన హెచ్‌ఎస్ ప్రణయ్‌పై విజయం సాధించారు. ఈ మ్యాచ్ 39 నిమిషాల పాటు సాగింది. ఆగస్టు 2న తైవాన్‌కు చెందిన చౌ టియన్-చెన్‌తో లక్ష్య.. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నారు.
ఆంధ్రప్రదేశ్ వార్తలు
నేడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఐఐటీ నిపుణులు రానున్నారు. గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యతను ఇంజినీర్లు అధ్యయనం చేయనున్నారు. రెండు రోజుల పాటు ఏపీ రాజధాని అమరావతిలోని కట్టడాలను వారు పరిశీలన చేయనున్నారు.
తెలంగాణ వార్తలు
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో ఏర్పాటుకానున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 57 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. వర్సిటీతోపాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్‌లకు కూడా శంకుస్థాపన చేశారు.
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న లే అవుట్ల క్రమద్దీకరణ(LRS) అంశానికి కదలిక వచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన గైడ్ లైన్స్‌ను రేవంత్ రెడ్డి సర్కార్ విడుదల చేసింది. కొన్ని నిబంధనలను సైతం సడలించింది. పెండింగ్ దరఖాస్తులను ఆమోదించడానికి అనుమతులు ఇచ్చింది. 2020లో నాటి బీఆర్ఎస్ సర్కార్ ఎల్ఆర్ఎస్ స్కీమ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో జాబ్ క్యాలెండర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్, కొత్త రేషన్ కార్డులు, నిఖత్, సిరాజ్‌లకు డీఎస్పీ ఉద్యోగం, వయనాడ్ భాధితులకు సాయం వంటి నిర్ణయలు తీసుకున్నారు.
జాతీయ వార్తలు
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని ధర్మాసనం పేర్కొంది. వర్గీకరణపై ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. నాటి ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. వర్గీకరణను రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కానీ, ఈ వర్గీకరణ రాజకీయ రంగు పులుముకోకుండా చూసుకోవాలని పేర్కొంది.
వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. పూజా ఖేడ్కర్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు తిరస్కరించింది. UPSCలో తప్పుడు పత్రాలు సమర్పించారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆమె అభ్యర్థిత్వాన్ని UPSC రద్దు చేసింది. భవిష్యత్తులో UPSCకి చెందిన పరీక్షలు రాయకుండా శాశ్వత నిషేధం విధించింది.
దేశంలో జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. జులై నెలలో రూ.1.82 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో రూ.1.74 లక్షల కోట్లు వసూలయ్యాయి. అప్పటితో పోలిస్తే వసూళ్లు 10 శాతం మేర పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు (ఏప్రిల్- జులై) మధ్య రూ.6.56 లక్షల కోట్ల వసూళ్లు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది.
అంతర్జాతీయ వార్తలు
పెన్సిల్వేనియా ప్రచార సభలో ఒక మహిళ చొరవ కారణంగానే తాను ప్రాణాలతో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పెన్సిల్వేనియా ప్రచార సభలో తాను మాట్లాడుతున్న సమయంలో.. దుండగుడు కాల్పులు జరపడానికి కొన్ని నిమిషాల ముందు కంప్యూటర్ సెక్షన్ సిబ్బందిలో ఒక మహిళ వలసదారుల చార్ట్‌ను స్క్రీన్‌పై ప్రదర్శించింది. దాన్ని చూసేందుకు తన తలను అటు వైపుగా తిప్పినట్లు చెప్పారు. ఆ సమయంలోనే దుండగుడు కాల్పులు జరిపాడని.. గుర్తుచేశారు. ఆ పని చేసిన మహిళను హారిస్‌బర్గ్ ప్రచార సభలో వేదిక పైకి పిలిచి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.
మంచి మాట
మీ ప్రయత్నం లేకపోతే..మీకు విజయం రాదు. కానీ, మీరు ప్రయత్నిస్తే.. ఓటమి రాదు.
- అబ్దుల్ కలాం
- అబ్దుల్ కలాం