Telangana Panchayat elections: మూడు విడతల పంచాయతీ ఎన్నికల సమరంలో మొదటి విడత పూర్తయింది. గెలిచిన వాళ్లు గెలిచారు. ఓడిన వాళ్లు ఓడారు. అయితే గెలిచిన వాళ్లు డబ్బులు ఖర్చయ్యాయని ఇంటికెళ్లి తలుపులేసుకుని ఏడుస్తున్నారో లేదో కానీ ఎన్నికను సీరియస్ గా తీసుకుని డబ్బులు కూడా పంచి ఓడిపోయిన వారి పరిస్థితి ఘోరంగా ఉంది. తమ గ్రామంలో వారు డబ్బులు తీసుకుని కూడా తమకు ఓట్లేయలేదని తెలిసి వారు పూర్తిగా మథనపడిపోతున్నారు. బహిరంగంగానే ఏడుస్తున్నారు. కొంత మంది తమ డబ్బులు తమకు వెనక్కి ఇచ్చేయాలని తాము పంచిన వారి దగ్గరకుపోయి డిమాండ్ చేస్తున్నారు.
డబ్బులు పంచినా గెలవని సర్పంచ్ అభ్యర్థులు
పలు చోట్ల పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచి పోటీ చేసిన ఒక సర్పంచి అభ్యర్థలు, ఓడిపోయిన తర్వాత అదే డబ్బులను తిరిగి వసూలు చేసుంటున్న ఘటనలు జరుగుతున్నాయి. నార్కట్ పల్లిలో ఓ గ్రామంలో ఓ పార్టీ మద్దతుదారు పోటీ చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు పంచాడు. కానీ, ఫలితాల్లో ప్రత్యర్థి ఏకంగా 450 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. ఇది చిన్నతేడా కాదు. దాదాపుగా 70 శాతాకానిపైగా జనం ప్రత్యర్థికి ఓట్లేశారు. అంత శాతం మందికి ఈ అభ్యర్థి డబ్బులు పంచాడు. అందుకే గ్రామంలోని ఇంటింటికీ తిరిగి దేవుడి ఫోటో పట్టుకొని విలపించాడు. "మీరు నాకు ఓటు వేస్తే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. లేదంటే, నేను మీకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వండి అని ఓటర్లను వేడుకున్నాడు. ఆయన ఏడుపును చూసి చాలా మంది తిరిగి ఇచ్చేశారు.
అన్ని పార్టీల అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకుంటున్న ఓటర్లు
50 లేదా 60 ఓట్ల తేడాతో ఓడిపోతే మాకు డబ్బులు అడగకపోయేవాళ్లమే. కానీ, 450 ఓట్ల మెజార్టీతో ఓడిపోయినందుకు తిరిగి అడుగుతున్నాము. ఓటర్లు మోసం చేశారని వాళ్ల వాదన. కానీ రాజకీయాల్లో డబ్బులు తీసుకుంటే ఓట్లేస్తారని కాదు. ఇప్పుడు అన్నిపార్టీల వారూ డబ్బులు ఇస్తున్నారు. ఓటర్లు తమకు ఇష్టమైన వారికి వేస్తున్నారు. ఆ సూక్ష్మాన్ని రాజకీయ నేతలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీ రాజ్‌లో భాగంగా, గ్రామాల్లో ఓటర్ల మధ్య డబ్బు పంపిణీ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నేక చోట్ల డబ్బు, మద్యం పంపిణీ ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి వస్తున్నాయి.
రాజకీయ నేతలే ఆలోచించుకోవాలి !
డబ్బులు పంచి గెలవాలనుకున్న రాజకీయ నేతలు ఆ పని చేస్తున్నారు. కానీ ఇప్పుడు అన్ని పార్టీల అభ్యర్థులు అదే పని చేస్తున్నారు. ప్రతి పార్టీ నుంచి ఓటర్ కు డబ్బులు చేరుతున్నాయి. కానీ ఓటర్ కు ఉండేది ఒక్క ఒటే. ఆ ఓటర్ తాను ఎవరికి వేయాలనుకుంటున్నాడో అతనికే ఓటు వేస్తాడు. అప్పుడు డబ్బులు పంచి ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. అందుకే రాజకీయ నేతలు డబ్బులు మిగుల్చుకోవడానికైనా క్లీన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.