BSP And BRS: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)కి రాజీనామా చేయడంపై మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.  మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి బీఎస్పీ అగ్రనాయకత్వంపై ఒత్తిడి తెచ్చి బీఆర్ఎస్‌తో పొత్తు రద్దు చేసుకోమన్నారని, ఆ విషయాన్ని ప్రెస్‌మీట్ పెట్టి ప్రకటించాల్సిందిగా తనకు అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. తనకు అది ఇష్టం లేకనే బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆర్‌ఎస్పీ క్లారిటీ ఇచ్చారు. రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్‌లో ఉదయం ప్రకటించిన ఆర్‌ఎస్పీ.. సాయంత్రం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని బహుజన ప్రయోజనాల కోసమే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని, తాను ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గనని అన్నారు. అందరితో చర్చించాక భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.


'భవిష్యత్‌లో కేసీఆర్, బీఆర్ఎస్‌తో కలిసి నడుస్తా. బీఎస్పీకి చాలా బాధతో రాజీనామా చేశా. పొత్తుపై కేసీఆర్‌కు మాట ఇచ్చా. ఆ మాట తప్పను. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించా. తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఎస్పీని వీడాను. నా అనుచరులు, అభిమానులతో చర్చలు జరిపిన అనంతరం రాజకీయ నిర్ణయం ప్రకటిస్తా. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేను బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేయడమే కాకుండా 107 మంది అభ్యర్థులను బరిలోకి దింపా. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కాకుండా ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని అనుకున్నాం. అధిష్టానంతో చర్చించిన తర్వాతే బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపై నిర్ణయం తీసుకున్నాం. బీఎస్పీకి కేసీఆర్ పొత్తులో భాగంగా రెండు సీట్లు కేటాయించారు. దీనికి బీఎస్పీ అగ్ర నాయకత్వం కూడా అంగీకరించింది' అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.


బీఆర్ఎస్. బీఎస్పీ పొత్తు పెట్టుకోవడం బీజేపీకి నచ్చలేదని, అందుకే బీఎస్పీ అగ్రనాయకత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పొత్తును రద్దు చేయించిందని ఆర్‌ఎస్పీ ఆరోపించారు. ఇది ఇష్టం లేకనే పార్టీని వీడినట్లు తెలిపారు. గతంలో తాను ఐపీఎస్ ఆఫీసర్‌గా దేశానికి ఎంతో సేవ చేశానని తెలిపారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినందుకు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేశానని, 4 వేల గ్రామాల్లో పర్యటించి పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లానని స్పష్టం చేశారు. మాయావతి సూచన మేరకు నల్లగొండ సభలో బీఎస్పీలో చేరానని, వెంటనే రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.


పొత్తు ఒప్పందంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను ముందుకు సాగాల్సిందేనని, కష్టసుఖాలు పంచుకోవాల్సిందేనని ఆర్‌ఎస్పీ తెలిపారు. బీజేపీ కుట్రలకు భయపడి తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేదనని, తన ప్రస్థానాన్ని ఆపలేనని అన్నారు. కాగా కొద్దిరోజుల క్రితం కేసీఆర్ ఇంటికి వెళ్లిన ఆర్‌ఎస్పీ పొత్తులపై చర్చించారు. అనంతరం కేసీఆర్, ఆర్‌ఎస్పీ కలిసి పొత్తుపై ప్రకటన చేశారు. బీఎస్పీకి నాగర్ కర్నూల్, హైదరాబాద్ టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ ఓకే చెప్పారు. కానీ ఏమైందో ఏమో కానీ బీఆర్ఎస్‌తో పొత్తుపై బీఎస్పీ అగ్రనాయకత్వం వెనక్కి తగ్గింది.