సీనియర్ నేతలు కే కేశవరావు, కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీని వీడటంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేకే, కడియం పార్టీ మారుతున్నారని, మంచి దారి వెతుక్కోవాలని కొందరు తనకు ఫోన్ చేశారని, కొందరు సందేశాలు పంపించారని మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అదే సమయంలో కొంత మంది బీఆరెస్ కార్యకర్తలు పార్టీని వీడొద్దు, ఈ పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలబడాలని తనను కోరినట్లు వెల్లడించారు. 


ఎక్కడికో పోవాలన్న ఆలోచన లేదు 
ప్రియమైన మిత్రులారా, దయచేసి ఎవరూ టెన్షన్ పడకండి. నేను గొర్రెను కాను. కాలేను. ఇంకెక్కడికో పోవాలన్న ఆలోచన కూడా లేదు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీని వీడను అని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. తాను గతంలో చేసిన బీఎస్పీ-బీఆరెస్ కూటమి కోసం ప్రయత్నంచా, తర్వాత బీఆర్ఎస్ లో చేరాలన్న నిర్ణయం చాలా ఆలోచించి తీసుకున్నవని తెలిపారు.  తాను రాజకీయాల్లోకి వచ్చింది తన పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసమో, ఆస్తుల కోసమో కాదన్నారు. పోలీసు కేసులకు భయపడో, హంగులు, ఆర్భాటాలున్న జీవితం కోసమో, ప్రోటోకాల్ కోసమో కాదని స్పష్టం చేశారు. తాను పుట్టి పెరిగిన సమాజం చాలా వేదనతో వెనకబడి ఉన్నది, వాళ్ల కోసం చట్ట సభల్లో ఒక గొంతుకగా బతికి, వాళ్ల జీవితాలను నా శక్తి మేరకు ‘సమూలంగా’ మార్చాలని ప్రజా జీవితంలోకి వచ్చానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.


‘బహుజన వాదం, తెలంగాణ వాదం రెండూ కలవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని నేను నమ్మిన. తెలంగాణ ఫలాలు అందరికి అందాల్సిన అవసరం ఇంకా ఉందని నమ్మి, భారత రాజ్యాంగానికి  ఫాసిస్టు శక్తుల వల్ల పొంచిఉన్న ప్రమాదాన్ని పసిగట్టి, అవిశ్రాంత, రాజీలేని పోరాటం నడిపి ప్రత్యేక రాష్ట్రం సాధించి, కొత్త తెలంగాణకు బలమైన పునాది వేసిన కేసీఆర్  నాయకత్వంలో నడుస్తున్న బలమైన బీఆర్ఎస్ పార్టీని వేదికగా ఎంచుకున్నాను. ఇందులో నాకు గాని, నన్ను నమ్ముకున్న వర్గాలకు ఎలాంటి సంశయం లేదు. గెలుపుతో వచ్చే అధికార ఫలాలను అనుభవించినప్పుడు, ఓటమితో వచ్చే కష్టాలను కూడా భరించగలిగే వాడే నిజమైన పార్టీ నాయకుడు. ప్రతి దానికి భయపడే పిరికిపందలకు బీఆరెస్ లాంటి ఉద్యమ పార్టీల్లో స్థానం ఉండకూడదు’ అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.


దేశంలోను, రాష్ట్రంలోనూ అధికార పార్టీలు పోలీసు కేసులను, కట్టు కథలను, ఆయుధాలుగా వాడి రాజకీయ ప్రత్యర్థులను నామరూపాలు లేకుండా చేయడం నేడు రాజకీయాలలో అతి పెద్ద సవాలు. దీన్ని ధైర్యంగా అధిగమించినప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా క్షమించరాని నేరానికి పాల్పడితే వారి మీద తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఆ విషయంలో పోలీసుల డ్యూటీని ఎవరూ కాదనరు. కానీ పోలీసు కేసులనే గోరంతలు కొండంతలుగా చూపించి, వాస్తవాలను వక్రీకరించి, సోషల్ మీడియా వేదికగా, అసభ్యకరమైన శీర్షికలతో రాజకీయ ప్రత్యర్థుల మీద జరుగుతున్న కుట్రపూరిత దాడులను తిప్పికొట్టాల్సిందే - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్


బీఆర్ఎస్ సైనికులకు ఒక విజ్ఞప్తి
రాజకీయాల్లో ఈ వెన్నుపోట్లు, ద్రోహాలు, కుట్రలు, దాడులు బీఆర్ఎస్ కు కొత్తేం కాదు. ప్రజల గుండెల్లో మనకు స్థానం పదిలంగా ఉన్నంత వరకు మనల్ని ఎవరూ ఆపలేరు. సమయాన్ని వృదా చేయకుండా, మనను నమ్ముకున్న ఆ ప్రజల వద్దకే వెళ్లి వాస్తవాలను వివరించి, లోక్ సభ ఎన్నికల్లో ఈ తెలంగాణ ద్రోహుల చెంప ఛెల్లుమనేలా విజయభేరి మోగిద్దాం అని ఆర్ఎస్పీ పిలుపునిచ్చారు. 


పదండి ముందుకు.. పదండి తోసుకు..
పోదాం పోదాం పైపైకి…
కదం తొక్కుతూ, పదం పాడుతూ
హృదయాంతరాళం గర్జిస్తూ 
పదండి పోదాం పైపైకి.. అంటూ శ్రీశ్రీ కవిత్వంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.