ఓ ప్రభుత్వ పాఠశాలను సీఎం కేసీఆర్ మనవడు హిమన్షు రావు దత్తత తీసుకొని డెవలప్ చేయడంపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా గురువారం (జూలై 13) ఆయన కాగజ్ నగర్ పట్టణంలోని పోచమ్మ బస్తీలో పర్యటించారు. పోచమ్మ ఆశీర్వాదం తీసుకొన్నారు. అనంతరం నోటు మీదే ఓటు మీదే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ఏనుగు గుర్తును ప్రచారం చేశారు. ప్రజలు ఇంటింటికి చందా ఇస్తూ ప్రవీణ్ కుమార్ ను ఆశీర్వదించారు. 


హిమన్షు రావు గురించి మాట్లాడుతూ.. ‘‘పాపం కేసీఆర్ మనవడు హిమాన్షు చాలా వరకు నిజాయితీగా మాట్లాడిండు. తెలంగాణలో పదేళ్లుగా శిథిలావస్థకు చేరిన విద్యావ్యవస్థ గురించి స్వయానా ముఖ్యమంత్రి కుటుంబం నుండే ఒకరు ముందుకు వచ్చి అమాయకంగా నిజం చెప్పడం స్వాగతిస్తున్నా. ఆగర్భ శ్రీమంతులు చదివే ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాజెక్టు(CAS) లో భాగంగా ఈ సోషల్ వర్క్ చేసిన ఈ బాలుడిని, ఆ టీచర్లను ప్రశంసించాల్సిందే.


కానీ, దీనంతటికీ తాత గారే స్ఫూర్తి అని ఆ బాలుడితో చెప్పించి రాజకీయం చేయడం బాగలేదు. పాపం అభం శుభం తెలియని పసివాడిని రాజకీయాల కోసం వాడుకున్నట్లుగా అనిపిస్తుంది. 1300 మంది విద్యార్థి యువకుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో, పేద విద్యార్థులు చదివే పాఠశాల ఆవరణలో పందులు సంచరించడం మాత్రం తాతగారి ఘనతే. కమీషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కాకుండా, అదే డబ్బు విద్య కోసం ఖర్చు చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు.


తాత, తనయుడు కలిసి ప్రభుత్వ పాఠశాలలు దారుణంగా ఉన్నాయని చెప్పించడంలో కూడా లోతైన రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయి. ప్రజల్లో అసహనం, వ్యతిరేకత పెరిగినప్పుడల్లా దోపిడీ పాలకులు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుంటారు. ఒకపక్క ప్రభుత్వం విఫలమైందని చెబుతూనే మరోపక్క సొంతంగా 'పాకెట్ మనీ' తో మేమే అభివృద్ధి చేయగల మానవతావాదులం చూపించే ప్రయత్నం కూడా నేటి స్వార్థ రాజకీయాల్లో భాగమే. 


పదేళ్ల పాలనలో హిమాన్షుకు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి తెలవనివ్వకపోవడం మన దురదృష్టం. తాత గారిని చూడాలని ఐఐఐటి బాసర విద్యార్థులు 15 రోజులు ధర్నా చేసినా కనబడలేదు. గుండె కరగలేదు. నిన్న సిర్పూర్ లోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులు కూడా తాతగారిని చూడాలని వారి బాధలు చెప్పుకోవాలని ఉందని నాతో చెప్పారు. టీచర్లు వారికి తిండి లేదని పాఠశాలకు రావద్దంటున్నారని వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణలో ఈ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితుల గురించి తాతకు, తనయునికి పూర్తిగా తెలుసు, కానీ మనుమడికి చూపించరు. ఒక వేళ తెలిసినా ఆ బాబును నిజం చెప్పనివ్వరు.


చీకటి ప్రపంచాన్ని నేను చూపిస్తా
అందుకే బహుజన వాలంటీర్ గా మాతో పాటు కలిసి వస్తే హిమాన్షుకు తాత, తనయులు నీకంట కనబడకుండా దాచిపెట్టిన ఒక చీకటి ప్రపంచాన్ని నేను నీకు చూపిస్తా. నీలాగే పాఠశాలలను అభివృద్ధి చేయాలని చాలా మందికి ఉంది కానీ, నీకు వచ్చినంత త్వరగా వాళ్లకు సీఎస్ఆర్ (CSR) నిధులు రావు. నిజాయతీగా చేసినా దాతలు సహకరించడం లేదు. పని చేసినా పత్రికల్లో కవరేజీ కూడా రాదు


చిన్న పిల్లలను బయటకు తీసుకొచ్చి తాత,తనయులు చేస్తున్న స్వార్థ రాజకీయాల గురించి త్వరలోనే ఈ బాబు తెలుసుకుంటాడని ఆశిస్తున్నా. అందరి తెలంగాణ, కొందరి తెలంగాణగా మాత్రమే ఎందుకు మారిందో శోధించే ప్రాజెక్టును కూడా తీసుకోవాలని ఓక్రిడ్జ్ స్కూల్ కు సలహా ఇస్తున్న. లేకపోతే ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అవుతుంది’’ అని అన్నారు.


స్థానిక పోచమ్మ బస్తీలో కాలనీ వాసులను ఉద్దేశించి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... కోనప్ప దోపిడీ దౌర్జన్యాన్ని, అరాచకాలను అంతం చేద్దాం. దోపిడీ పాలనలో స్థానికులకు అన్యాయం జరుగుతోంది. పేపర్ మిల్లులో స్థానిక ఉద్యోగుల సంఖ్య తగ్గింది. యూనియన్ ఎన్నికలు నిర్వహించడం లేదు. కనీసం బోనస్ కూడా ఇవ్వడం లేదని, ప్రశ్నించిన వారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని బెడిరిస్తున్నారని మండిపడ్డారు. కంపెనీ నుండి విడుదలయ్యే కలుషిత గాలి, నీరు, దుర్వాసన మనం పీలుస్తున్నాం’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అర్షద్ హుస్సేన్, సీడం గణపతి, జిల్లా నాయకులు సోయం చిన్నయ్య, దుర్గం ప్రవీణ్, నియోజకవర్గ నాయకులు రాంటెంకి నవీన్ తదితరులు పాల్గొన్నారు.