Rouse Avenue court give Kavitha three more days in ED custody  : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) ఈడీ కస్టడీ (ED Custody) మరో మూడు రోజులు పొడిగించారు.  ఇప్పటికే  ఏడు రోజుల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. కస్టడీ గడువు ముగియడంతో  రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ఈడీ అధికారులు హాజరుపరిచారు. విచారించాల్సింది ఇంకా చాలా ఉందని.. ఈ కస్టడీలో కవిత నుంచి ఎలాంటి సమాచారం రాలేదని కోర్టుకు తెలపడంతో మూడ్రోజులపాటు కస్టడీకి న్యాయస్థానం అంగీకరించింది.  ఐదు రోజుల కస్టడీ కావాలని కోరగా కోర్టు మాత్రం మూడ్రోజులకే అనుమతిచ్చింది.


విచార‌ణ‌కు క‌విత స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఈడీ ఆరోపించింది. స‌మీర్ మ‌హీంద్ర‌తో క‌లిపి క‌విత‌ను ప్ర‌శ్నించాల‌ని తెలిపింది. లిక్క‌ర్ స్కామ్ లో రూ. కోట్ల‌లో లంచాలు అందాయ‌ని ఈడీ పేర్కొంది. సౌత్‌గ్రూప్‌కు రూ.100కోట్లు చేరాయ‌ని ..క‌విత ఫోన్ డేటాను తొలిగించిన‌ట్లు త‌మ ద‌ర్యాప్తులో తేలింద‌ని ఈడీ కోర్టుకు తెలియ‌జేసింది. అలాగే ఆమె కుటుంబ స‌భ్యుల వివ‌రాల‌ను ఇవ్వ‌డం లేద‌ని ఈడీ త‌రఫు లాయ‌ర్ అన్నారు. క‌విత మేన‌ల్లుడి వ్యాపారానికి సంబంధించిన వివ‌రాలు అడిగిన‌ట్లు ఈడీ తెలిపింది. ప్ర‌స్తుతం క‌విత మేన‌ల్లుడి ఇంట్లో సోదాలు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొంది. క‌విత‌ను ఆమె మొబైల్ ఫోన్‌కు సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ నివేదిక‌తో విచారిస్తున్నామ‌ని ఈడీ త‌ర‌ఫు లాయ‌ర్ తెలియ‌జేశారు. సోదాల్లో మేన‌ల్లుడి ఫోన్ స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపింది. 
 
అంతకుముందు కోర్టులోపలికి వెళ్తూ ఆమె.. ఈడీ విచారణపై అసహనం వ్యక్తంచేశారు. ఏడాది నుంచి అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని అన్నారు. తనపై పెట్టింది రాజకీయ కేసని, తప్పుడు కేసని, ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసని వ్యాఖ్యానించారు. తన అరెస్టు పూర్తిగా చట్ట విరుద్ధమని, కోర్టులో న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో అరెస్టులు పూర్తిగా రాజకీయ దురుద్దేశమనని.. ఈసీ జోక్యం చేసుకోవాల్సి ఉందన్నారు.  కేసులో మరికొన్ని అంశాలపై విచారణ జరపాల్సి ఉందని ఈడీ తరపు  న్యాయవాది కోర్టులో వాదించారు.  నలుగురి స్టేట్‌మెంట్లతోపాటు కిక్‌ బ్యాగ్స్‌ గురించి కవితను అడిగామని చెప్పారు. లిక్కర్‌ కేసులో కోట్ల రూపాయలు చేతులు మారయన్నారు. డాక్టర్ల సూచన ప్రకారం కవితకు మందులు, డైట్‌ ఇస్తున్నామని తెలిపారు.


మరో వైపు  కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లలో ఈడీ అధికారుల విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు.  అనిల్ సోదరితో పాటు పలువురు బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.  లిక్కర్ స్కాం ద్వారా వచ్చిన సొమ్మును అనిల్ డైరక్టర్ గా ఉన్న కంపెనీ ద్వారా ఆస్తులు కొన్నట్లుగా గతంలో ఈడీ ఆరోపించింది. ఆ దిశగానే ఇప్పుడు సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈడీ విచారణకు అనిల్ హాజరు కావాల్సి ఉన్నా పది రోజుల తర్వాత వస్తానని లేఖ రాశారు.