Telangana CM Revanth Chit Chat: కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఆపుతోందని కిషన్ రెడ్డేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సొంత అభిప్రాయాలు ఉండవని.. ఆయన కేటీఆర్ వద్ద నుంచి సలహాలు తీసుకుంటారన్నారు. కేటీఆర్ సలహాలతోనే కాళేశ్వరం పై సీబీఐ విచారణకు అడ్డం పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో బీఆర్ఎస్ పోటీచేయడమే దీనికి సాక్ష్యమన్నారు.  గతంలో కాళేశ్వరం కేసు సీబీఐకి ఇస్తే 48 గంటల్లో విచారణ ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి చెప్పారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కిషన్ రెడ్డి చెప్పారు కానీ ఇప్పటి వరకూ చేయలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారంపైనా రేవంత్ స్పందించారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ అంశం హైకోర్టు పరిధిలో ఉందని.. లేకపోతే సీబీఐకి ఇచ్చే వాళ్లమన్నారు. 

Continues below advertisement

కల్వకుంట్ల కవిత వ్యవహారం .. వారి కుటుంబ సమస్య అని రేవంత్ స్పష్టం చేశారు. అయితే కవిత కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే మాత్రం వ్యతిరేకిస్తానని తెలిపారు. కవితపై హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, సంతోష్ రావు దాడి చేస్తున్ారని సానుభూతి తెలిపారు. వారి కుటుంబంలో ఆస్తి పంచాయతీ నడుస్తోందని.. తనకు సంబంధం లేదని రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు సామాజికంగా బహిష్కరించారని రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఉద్యమం పేరుతో యువతను పొట్టన పెట్టుకున్నారన్నారు. ఇప్పుడు ఆ ఉసురు తాకే కుమార్తె దూరమైందని రేవంత్ వ్యాఖ్యానించారు. గతంలో నా కూతురు పెళ్లికి వెళ్లకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. 

మంత్రులను తాను భయపెట్టడం లేదని.. ఎవరి పని వారు చేసుకుంటున్నారని రేవంత్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపైనా రేవంత్ చర్చించారు. నెలాఖరులోపు స్థానిక ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమన్నారు. అందుకే స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ అంశంపై న్యాయనిపణులను సంప్రదిస్తున్నామని తెలిపారు. బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ లకు సుప్రీంకోర్టు ఇచ్చిన 90 రోజుల గడువుపై...సుప్రీంకోర్టులో తుది తీర్పు వచ్చే వరకూ ఎదురు చూస్తామన్నారు. 

Continues below advertisement

పార్టీ ఫిరాయింపుల అంశంపైనా రేవంత్ స్పందించారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై నిర్దిష్టమైన నియమాలు ఏవీ లేవని గుర్తు చేశారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉందన్నారు. కండువా వేసుకున్నంత మాత్రానా పార్టీ ఫిరాయించినట్లేనా అని ప్రశ్నించారు.  మెట్రో వివాదంపైనా రేవంత్ ఘాటుగా స్పందించారు. ఎల్ అండ్ టీ తాము చెప్పినట్లుగా వినాల్సిందేనని.. కేసీఆర్‌తో కుమ్మక్కయితే ఊరుకునేది లేదన్నారు. 

ఢిల్లీ వెళ్లినప్పుడల్లా రేవంత్ ఇలా మీడియా సమావేశంలో ఇష్టాగోష్టితో రాజకీయంగా సంచలనాత్మకమైన ప్రకటనలు చేశారు. కాళేశ్వరం కేసు ను సీబీఐకి ఇవ్వడంపైనా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారని ఇప్పుడు బీజేపీకి ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డిపై ఆరోపణలతో.. రేవంత్ రెడ్డి బీజేపీపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు.