Revanth Reddy AI Summit: భారత్ ఏఐ గమనాన్ని మార్చాలి - ఏఐ కౌన్సిల్, ప్రత్యేక మంత్రిత్వ శాఖపై రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదనలు
Revanth Reddy: ఏఐ కౌన్సిల్ , మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి .. కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్ లో కీలక ప్రకటనలు చేశారు.

AI Council and Ministry: కృత్రిమ మేధస్సు యావత్ ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో, దీనిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి జాతీయ స్థాయిలో జీఎస్టీ కౌన్సిల్ తరహాలో ఏఐ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన సమ్మిట్‌లో ఆయన కీలకోపన్యాసం చేస్తూ.. జాతీయ భద్రత, చట్టపరమైన రక్షణ కోసం ప్రత్యేకంగా ఏఐ మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రిని కోరారు. ఏఐ పురోగతిని పర్యవేక్షించేందుకు హైదరాబాద్ కేంద్రంగా జాతీయ ఏఐ వార్‌రూమ్ ఏర్పాటు చేయడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.
తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజ్
భారత ప్రభుత్వం సహకారంతో దేశంలోనే మొట్టమొదటి ఏఐ స్టార్టప్ విలేజ్ ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏఐ అనేది కేవలం సాంకేతికత మాత్రమే కాదని, అది సామాజిక న్యాయ సాధనకు, పేదరిక నిర్మూలనకు ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ నాయకులను, సాంకేతిక నిపుణులను ఆహ్వానిస్తూ.. ప్రతి ఏటా ఒకసారి కాకుండా, వివిధ నగరాల్లో సంవత్సరానికి రెండుసార్లు ఏఐ సమ్మిట్లు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.
ప్లాట్‌ఫార్మ్ క్రియేటర్లుగా ఎదగాలి !
భారతదేశం ఇప్పటివరకు కేవలం సేవల రంగంలోనే పురోగతి సాధించిందని, గూగుల్, మెటా, వాట్సాప్ వంటి ప్రపంచ స్థాయి ప్లాట్‌ఫార్మ్‌లను సృష్టించలేకపోయామని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ఏఐ విప్లవాన్ని అందిపుచ్చుకుని, భారత్ కేవలం సేవలందించే దేశంగా కాకుండా ప్లాట్‌ఫార్మ్ క్రియేటర్ గా ఎదగాలని పిలుపునిచ్చారు. జీపీయూ చిప్ తయారీ నుండి గ్రీన్ ఎనర్జీ, డేటా స్టోరేజీ వరకు ఏఐ వాల్యూ చైన్ మొత్తం మీద భారతదేశం నాయకత్వం వహించాలని, అందుకు స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఉండాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. w]
Revanth Reddy, speaking at the AI Impact Summit, called for the establishment of a National AI Council and an AI Ministry to ensure artificial intelligence is used for the public good, safeguards national security, and prevents AI misuse. pic.twitter.com/RCgFcjHrnz
— Aapanna Hastham (@AapannaHastham) February 20, 2026
ఉద్యోగ భద్రత, రీ-స్కిల్లింగ్ వ్యూహం
ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలు ఉన్నందున యువతకు కొత్త అవకాశాలు కల్పించేలా సమగ్ర రీ-స్కిల్లింగ్ వ్యూహాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మన యువత ప్రపంచ స్థాయి యూనికార్న్ సంస్థలను స్థాపించేలా కేంద్రం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరారు. గతంలోని యంత్రాలు కేవలం శారీరక శక్తిపై పనిచేస్తే, ఆధునిక ఏఐ వ్యవస్థలు మేధో సామర్థ్యంతో నిర్ణయాలు తీసుకుంటున్నాయని.. ఈ మార్పును గమనించి వ్యూహాత్మక సంస్థలను నిర్మించడం ద్వారానే భారత్ ప్రపంచ ఏఐ పోటీలో విజేతగా నిలవగలదని రేవంత్ రెడ్డి తెలిపారు.























