Three innovative schemes launched : హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దివ్యాంగులు, వృద్ధులు , చిన్నారుల సంక్షేమం కోసం మూడు వినూత్న పథకాలను ఆవిష్కరించారు.  తమ ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తూ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతికేలా చర్యలు తీసుకుంటోందని  తెలిపారు. ఇందులో భాగంగా రూ. 50 కోట్లతో దివ్యాంగులకు సహాయక ఉపకరణాల పంపిణీ , చిన్నారుల సంరక్షణ కోసం బాల భరోసా,    వయోవృద్ధుల కోసం ప్రణామ్ డే కేర్ సెంటర్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సింహ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Continues below advertisement

మున్సిపాల్టీల్లో కోఆప్షన్ మెంబర్లుగా ట్రాన్స్ జెండర్         

దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించామని..  వారి వివాహ కానుకను రూ. 2 లక్షలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. విద్య, ఉద్యోగాల్లో దివ్యాంగుల కోటాను పక్కాగా అమలు చేస్తామని, క్రీడల్లో రాణించే వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు. దివ్యాంగులకు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఒక గొప్ప స్ఫూర్తి అని, వైకల్యాన్ని జయించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే, సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్ల సమస్యలపై వారే స్వయంగా మాట్లాడుకునేలా, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఒక ట్రాన్స్‌జెండర్‌ను కో-ఆప్షన్ మెంబర్‌గా నామినేట్ చేయాలని  సూచించినట్లు పేర్కొన్నారు.     

Continues below advertisement

తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే పదిశాతం జీతం కట్                                

వయోవృద్ధుల సంరక్షణ విషయంలో ముఖ్యమంత్రి సంచలన నిర్ణ యాన్ని ప్రకటించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, అలాంటి వారి జీతంలో  10 శాతం నేరుగా తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్లేలా చట్టం తీసుకువస్తామని హెచ్చరించారు. వృద్ధులకు ప్రభుత్వమే కుటుంబంగా మారి  ప్రణామ్  కేంద్రాల ద్వారా ఆసరా అందిస్తుందని తెలిపారు. వీటితో పాటు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాబోయే బడ్జెట్ సమావేశాల్లో  కొత్త హెల్త్ పాలసీని * ప్రవేశపెట్టనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.         

సామాజిక న్యాయం దిశగా అడుగులు                           

సామాజిక న్యాయం దిశగా తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని, రాష్ట్రంలో చేపట్టిన కులగణన మోడల్‌ను ఇప్పుడు దేశమంతా అనుసరిస్తోందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. తెలంగాణ ఒత్తిడి వల్లే కేంద్రం కూడా జనగణనలో కులగణన చేసేందుకు అంగీకరించిందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో సామాన్యులకు ప్రవేశం లేని ప్రజా భవన్, నేడు ప్రజల సమస్యలు వినే  ధర్మ గంట గా మారిందని, ఎస్సీ వర్గీకరణ ద్వారా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే పరమావధిగా తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆయన పునరుద్ఘాటించారు.