CM Revanth Reddy Speech in Telangana formation day celebrations: పదేండ్ల పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అది భౌతిక విధ్వసం మాత్రమే కాదు.. తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛ పై దాడి జరిగిందని విమర్శించారు. సామాజిక న్యాయం మేడిపండు చందంగా మారిందని.. ప్రజలందరికీ చెందాల్సినరాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరిందని ఆరోపించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కర్లేదని అన్నారు.
ప్రజలే, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉందని.. ఈ ప్రజా ప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇదని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ పదో వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జాతినుద్దేశించి ప్రసంగించారు.
ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి ఆహ్వానించడం కోసం బిడ్డకు అనుమతి కావాలా? ఏ హోదాలో ఏ పదవిలో ఉన్నారని మహాత్మాగాంధీని జాతి పితగా గుర్తుంచుకున్నాం? తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు ఈ సమాజం సోనియాను గుర్తుంచుకుంటుంది. తెలంగాణతో సోనియా గాంధీది పేగు బంధం. రాజకీయ బంధం కాదు.
తెలంగాణ వచ్చి పదేళ్లయినా రాష్ట్ర గీతం లేదు. అందుకే జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఉంచాలని నిర్ణయించాం. అందెశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర గేయంగా ఉంటుందని విశ్వసించి ఆ గీతాన్ని సగర్వంగా ప్రకటిస్తున్నాం. తెలంగాణ చిహ్నం జాతి చరిత్రకు అద్దం పట్టేది. జాతి చరిత్ర అందులోనే ప్రతిబింబిస్తుంది. తెలంగాణ అంటేనే ధిక్కారం, పోరాటం అందుకే రాష్ట్ర అధికారిక చిహ్నంలో ధిక్కారం, పోరాటం ప్రతిబింబించాలి. అందుకే ఆ సూచనలకు అనుగుణంగా కొత్త చిహ్నం రూపొందిస్తున్నాం. ప్రజల ఆకాంక్షల మేరకు టీఎస్ ను టీజీగా మార్పు చేశాం. సగటు గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లిగా ఉండాలి. తెలంగాణ తల్లి అంటే కష్టజీవి, కరుణామూర్తి.. వీటితో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవం పోస్తాం’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
గ్రూప్ - 1 నోటిఫికేషన్
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించడం కోసమే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశాం. 70 రోజుల్లోనే 30 వేల మంది యువతకు ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం.. ఈ నెల 9న ప్రిలిమినరీ పరీక్ష జరగబోతోంది. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చాం. వయో పరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచాం. ప్రభుత్వంలో ఖాళీలను భర్తీ చేయబోతున్నాం.
పేదలకు 4,50,000 ఇళ్లు
తెలంగాణలో లక్షల మంది ప్రజలు సొంత ఇళ్ల కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మొదలుపెట్టాం. ఈ ఒక్క ఏడాదిలోనే రూ.22,500 కోట్లు కేటాయించాం. త్వరలో పేదల కోసం 4,50,000 ఇళ్లు కట్టించబోతున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇస్తాం. ఇంటి స్థలం లేని వారికి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వబోతున్నాం.