87th Jayanthi Celebrations of Duddilla Sripada Rao: హైదరాబాద్: హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై శ్రీపాదరావు విగ్రహం (Statue of Duddilla Sripada Rao) ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న సహా తెలంగాణకు చెందిన పాటు పలువురు ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. దీనిపై త్వరలోనే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ తెలిపారు. శ్రీధర్ బాబు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారని, మొదటిసారి శ్రీపాద రావు తనయుడుగా ఆయన గెలిచారు... కానీ ఆ తర్వాత తన టాలెంట్, పనితనం వల్లనే శ్రీధర్ బాబు పలుమార్లు గెలిచారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి శ్రీధర్ బాబు అన్నీ తానై ముందు ఉండి నడిపిస్తున్నాడని చెప్పారు.


పీవీకి, మంథని నియోజకవర్గనికి చాలా ప్రాముఖ్యత 
రవీంద్రభారతిలో దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఆర్థిక సంస్కరణల పితామహుడు, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు రాజకీయ ప్రస్థానం మంథని నుండి మొదలైందన్నారు. చరిత్రలో పీవీకి, మంథని నియోజకవర్గనికి చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. పీవీ అనుచరుడుగా శ్రీపాద రావు రాజకీయ ప్రస్థానం మంథని స్థానం నుంచి మొదలు అయిందన్నారు. శ్రీపాద రావు స్పీకర్ గా, ఉమ్మడి రాష్ట్రములో మంచి సంప్రదాయం నెలకొల్పారని గుర్తుచేసుకున్నారు. శ్రీపాద రావు వంటి నాయకుడు తెలంగాణ లో పుట్టడం అదృష్టమన్నారు.






అసెంబ్లీ అంటే నాయకుల మధ్య గొడవ జరిగే ప్రదేశం కాదు, ప్రజల సమస్యలు ప్రస్థావించే వేదిక అని నిరూపించారు. ఇపుడు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు కూడా అసెంబ్లీ సమావేశాలు చాలా ప్రశాంతంగా, అర్థవంతంగా జరిగేలాగా చూశారని రేవంత్ పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదాలో ఎన్టీఆర్.. శ్రీపాద రావు స్పీకర్ గా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించారని రేవంత్ గత రోజుల్ని గుర్తుచేశారు. స్పీకర్ గా శ్రీపాద రావు పాత్ర మరువలేనిదని కొనియాడారు.


అధికారికంగా నిర్వహించడంపై శ్రీధర్ బాబు హర్షం.. 
మాజీ స్పీకర్‌ శ్రీపాదరావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయం అని ఆయన తనయుడు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. మంత్రి శ్రీధర్‌ బాబు మంథని పట్టణంలో శ్రీపాద చౌరస్తా వద్ద శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణకి సంబంధించి అరుదైన నేతలలో శ్రీపాదరావు ఒకరని, ఆయన సేవల్ని గుర్తించి మాజీ స్పీకర్ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం శ్రీపాదరావు కృషి చేశారని.. ఉమ్మడి ఏపీ శాసనసభ స్పీకర్‌గా సమర్థ వంతంగా సేవలు అందించారని శ్రీధర్ బాబు కొనియాడారు. మంథని ప్రాంత ప్రజల ఆశీర్వాదం మేరకు తనకు శాసన సభ్యుడిగా అవకాశం కలిగిందని, ఆపై మంత్రిని సైతం అయ్యానని చెప్పారు. మంథని రైతులకు సాగునీటి సమస్యను పరిష్కరించాలనేది శ్రీపాదరావు లక్ష్యమన్నారు. ఇక్కడ చిన్న లిఫ్ట్‌ ఏర్పాటు చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ లిఫ్ట్‌ లేక పోవడంతో మంథని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు.