Revant Meet Tummala : బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ లభించకపోవడంతో అసంతృప్తికి గురైన తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ లోని తుమ్మల నివాసంలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మరికొంత మంది నేతలు వెళ్లి కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేరే ఉద్దేశం ఉండటంతోనే వారిని తన నివాసానికి తుమ్మల ఆహ్వానించారన్న ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు సుదర్శన్ రెడ్డి, మల్లు రవి కూడా ఉన్నారు. వారందరినీ తమ్ముల నాగేశ్వరరావు శాలువాలతో సన్మానించారు.
తుమ్మల వద్దకు కనీస రాయబారం పంపని బీఆర్ఎస్ హైకమాండ్
ఖమ్మం జిల్లా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు బలప్రదర్శన చేసినా బీఆర్ఎస్ హైకమండ్ పట్టించుకోవడం లేదు. వేములవాడ ఎమ్మెల్యేకు టిక్కెట్ నిరాకరించినా సలహాదారు పదవి ఇచ్చి సర్ది చెప్పారు. మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. ఇతర అసంతృప్త నేతల్ని బుజ్జగిస్తున్నారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో ఉన్నా లేకపోయినా ఎలాంటి సమస్యా లేదన్నట్లుగా వ్యవహరిస్తూండటంతో.. ఇక పార్టీ మారడం ఖాయమన్న నిర్ణయానికి తుమ్మల అనుచరులు వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడంతో ఇక ఆ పార్టీలో చేరిక ఖాయమనుకుంటున్నారు.
బుజ్జగించేప్రయత్నం చేయని బీఆర్ఎస్ హైకమాండ్
తుమ్మలకు రాజ్యసభ సీటుగానీ, ఎమ్మెల్సీ అవకాశంగానీ ఇస్తామని బీఆర్ఎస్ పెద్దలు బుజ్జగిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ల అయితే ఇదంతా నిజం కాదని, ఈ ప్రచారం బీఆర్ఎస్ గేమ్ ప్లాన్‌లో భాగమని తుమ్మల వర్గీయులు కొట్టి పారేస్తున్నారు. తుమ్మల బీఆర్ఎస్‌లో కొనసాగే ఆలోచనతో లేదంటున్నారు. బీఆర్ఎస్ కూడా తుమ్మల పార్టీ మారితే జరిగే నష్టంపై అంచనాలు వేస్తున్నదే తప్ప ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపించడం లేదని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ఒక్క సీటే గెలిచిందని, ఇప్పుడు అంతకు మించిన నష్టం ఏమీ ఉండదని కేసీఆర్భావిస్తున్నట్టు చర్చ సాగుతోంది. భద్రాద్రి జిల్లా ఎమ్మెల్యేలను.. అభ్యర్థులను కేసీఆర్ సమవేశానికి పిలిచారు కానీ.. తుమ్మలను పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు.
పాలేరు నుంచి పోటీ .. కూకట్ పల్లి కూడా ప్రచారంలోకి !
పాలేరు నుంచి పోటీ చేయాలన్న పట్టుదలతో తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. అయితే పాలేరు నుంచి పోటీకి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ఖమ్మం సిటీ లేకపోతే.. కూకట్ పల్లి నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. తుమ్మల నాగేశ్వరరావు తాన రాజకీయ జీవితంలో ఖమ్మం జిల్లా నుంచే రాజకీయాలు చేశారు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తారని ఆయన వర్గీయులు ఆనుకోవడం లేదు. ఖమ్మం నుంచే పోటీ చేస్తారని భావిస్తున్నారు.