Revanth following Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్ (Jagan)బాటలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) నడవనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సామాన్యులకు చేరువయ్యేలా సీఎం జగన్ వినూత్నంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి 50 కుటుంబాలకు ఒకరిని నియమించి.. వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే అందిస్తున్నారు. ఇప్పుడు ఇదే పద్ధతిని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అనుసరించనున్నారు. ప్రతిగ్రామంలో ఐదుగురితో ఇందిరమ్మ (Indiramma Commitee) కమిటీలు వేసి వారి ద్వారా లబ్ధిదారులకు పథకాలు అందేలా చేస్తామని తాజాగా రేవంత్ రెడ్డి ప్రకటించారు.
జగన్ బాటలో రేవంత్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ(YCP) ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. ఈ వ్యవస్థ ముఖ్యమంత్రి జగన్(Jagan)కు పరిపాలనలోనూ, రాజకీయంగా పార్టీకి ఎంతో ఉపయుక్తంగా మారింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్(Volunteer)ను నియమించారు. ఆ కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన అన్ని పథకాలు, సౌకర్యాలను అందించే బాధ్యత ఆ వాలంటీర్‌దే. సామాజిక పింఛన్ల దగ్గర నుంచి.. అమ్మఒడి, ఆసరా పథకాల లబ్ధిదారుల ఎంపిక బాధ్యత మొత్తం వాలంటీర్లే చూసుకుంటున్నారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ.5 వేల రూపాయల గౌరవ వేతనంతోపాటు ఏడాదికి ఒకసారి వాలంటీర్ రత్న ప్రోత్సహకాలు అందిస్తోంది. అయితే, పేరుకే వాలంటీర్లు అని.. వీరంతా వైసీపీ(YCP) కార్యకర్తలేనని విపక్షాలు ఆరోపిస్తుంటాయి.
ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం వల్ల జగన్‌కు బాగా ఉపయోగపడిందనేది వారి వాదన. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించడంతోపాటు.. అవన్నీ జగన్, వైసీపీ ప్రభుత్వ చలవేనంటూ వాలంటీర్లు ప్రజల్ని మభ్యపెడుతున్నారని అంటున్నారు. పరోక్షంగా వాలంటీర్లు రాజకీయంగా జగన్(Jagan)కు ఎంతో ఉపయోగపడుతున్నారనే అభిప్రాయం ఉంది. వైసీపీకి ఓటు వేయాలని.. లేకుంటే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలను విపక్షాలు వెలుగులోకి తీసుకువస్తున్నాయి. ఇక వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరి డేటా ఇప్పుడు జగన్ గుప్పెట్లో ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో వాలంటీర్ల ద్వారా నయానో, భయానో ఓట్ల శాతాన్ని పెంచుకునే అవకాశం జగన్‌కు వచ్చిందని అంటున్నారు.
రేవంత్ కూడా ఇదే బాటలో?
ఇప్పుడు సరిగ్గా ఇదే పద్ధతిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అనుసరించనున్నారు. ప్రజలందరికీ సంక్షేమపథకాలు అందించేందుకు ప్రతి గ్రామంలో ఐదుగురు సభ్యులతో ఇందిరమ్మ కమిటీలు నియమించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు వీరు వారధులుగా పనిచేయనున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీకోసం పనిచేసిన వారికే అవకాశం గత పదేళ్లలో బీఆర్ఎస్(BRS) అరాచకాలను ఎదురించి పార్టీకోసం నిలబడిన వారికే ఇందిరమ్మ కమిటీల్లో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కష్టపడి పనిచేసిన వారికే ఊరిలో ఎవరికి ఏం ఇవ్వాలో తెలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రతి గ్రామంలోనూ వివిధ సామాజికవర్గాల నుంచి ఎంపిక చేసిన ఐదుగురి పేర్లను స్థానిక ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ద్వారా సంతకం పెట్టించి జిల్లా మంత్రులకు అందజేయాలన్నారు.
తక్షణమే ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారెంటీలను వారి ద్వారానే ప్రజలకు అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కష్టపడిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను గుర్తుపెట్టుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.