Revant Reddy :  బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ హింసను ఎప్పుడూ నమ్ముకొదని, అహింసా మూల సిద్ధాంతంగా పని చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని  స్పష్టం చేారు.  దాడికి పాల్పడిన వ్యక్తి ఎరైనా కేసు నమోదు చేసి విచారణ జరపాలన్నారు. ఈ విషయంలో వెంటనే పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 


కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి అంశంపై బీఆర్ఎస్ నేతలు రాజకీయ ఆరోపణలు ప్రారంభించారు. నిందితుడు ఎందుకు ఈ దాడి చేశాడో పోలీసులు ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే హరీష్ రావు .. రాజకీయ కుట్ర ఉందేమో  దర్యాప్తు చేయిస్తామన్నారు. తర్వాత సీఎం కేసీఆర్ ఇది రాజకీయ దాడేనని విమర్శలు ప్రారంభించారు. మాకు కూడా మొండి కత్తులు దొరుకుతాయని హెచ్చరించారు. చికిత్స పొందుతున్న  ఆస్పత్రి వద్ద బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు వ్యతిరేకంగా  కొత్త ప్రభాకర్ రెడ్డి అనుచరులు నినాదాలు చేశారు. 


అయితే మంత్రి కేటీఆర్  ట్విట్టర్ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ గుండాలే దాడి చేశారని ఆరోపించారు.  తెలంగాణలోని నాయకులపై భౌతిక దాడులకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. థర్డ్ రేటెడ్ క్రిమినల్ అయిన టీపీసీసీ ప్రెసిడెంట్ నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు.. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందనుకుంటున్నా..’ అంటూ ట్వీట్ చేశారు.  





 ఎంపీపై హత్యాయత్నానికి ప్రయత్నించిన రాజు స్వగ్రామం మిరుదొడ్డి మండలం చెప్యాలగా పోలీసులు గుర్తించారు. రాజు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. రెండు ఫేస్ బుక్ అకౌంట్లను నిందుతుడు వాడుతున్నాడు. ఫేస్ బుక్‌లో పలువురు రాజకీయ నేతలతో దిగిన ఫోటోలను రాజు అప్ లోడ్ చేశాడు. ప్రస్తుతం ఓ యూట్యూబ్ చానల్‌లో రాజు పనిచేస్తున్నాడు. ఇక, 38 ఏళ్ల రాజుపై హత్యాయత్నం చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సిద్ధిపేట పోలీసు కమీషనర్ ఎన్ శ్వేత తెలిపారు. ఈ దాడికి సంబంధించి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. కాగా బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో రాజు సైతం తీవ్రంగా గాయపడటంతో మెరుగైన చికిత్స కోసం నిందితుడిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.