BC Protest at Jantar Mantar: జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్

Revanth Reddy | బీసీ సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో చేపట్టిన బీసీ పోరు గర్జలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్రం జనగణనతో పాటు కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.

Continues below advertisement

Congress Leader BC Maha Dharna in Delhi | న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్‌లో ఆమోదించాలని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర బీసీ సంఘాలు ధర్నా చేపట్టాయి. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు బీసీ పోరు గర్జన ధర్నాలో పాల్గొని బీసీలకు న్యాయం జరగడంపై పోరాటం చేయాలని బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాల ధర్నాకు హాజరై సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీనియర్ నేత వీ హనుమంతరావు, తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

Continues below advertisement

హామీ మేరకు తెలంగాణలో కులగణన

"బీసీ కులగణన ఆలోచనకు స్ఫూర్తి రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో బహుజనులందరూ తమ లెక్కలు తేల్చాలని ఆయనను కోరారు. జనగణనతో పాటు కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ వెనక్కి తగ్గదు. ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. అందులో భాగంగానే తెలంగాణలో కులగణన చేపట్టాం.

4 ఫిబ్రవరి 2024 న శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాం. అధికారంలోకి వచ్చి 100 రోజులు తిరగకముందే బలహీన వర్గాల లెక్క తేల్చి చట్టసభల్లో తీర్మానం చేశాం. ఈ ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరి 2025 నాటికి పూర్తి చేసి చట్టసభల్లో ప్రవేశపెట్టాం. అందుకే ఫిబ్రవరి 4 ను సోషల్ జస్టిస్ డే గా జరుపుకోవాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. బలహీనవర్గాల కోరిక న్యాయమైంది.. దీన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలి. కానీ బీజేపీ అందుకు సిద్ధంగా లేదు.. వాళ్ల విధానపరమైన ఆలోచనే బలహీన వర్గాలకు వ్యతిరేకం. గతంలో మండల్ కమిషన్ నివేదిక అమలుకు వ్యతిరేకంగా కమండల్ యాత్ర చేసిన చరిత్ర బీజేపీది. అలాంటి బీజేపీ నేత నరేంద్ర మోదీ నేడు ప్రధానిగా ఉన్నారు. 2021 లో చేయాల్సిన జనగణనను వాయిదా వేశారు. జనగణనతో పాటు కులగణన చేసి రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. 


బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో మోదీకి కష్టమేంది..

కులగణన ద్వారా తెలంగాణలో బలహీన వర్గాల లెక్క 56.36 శాతమని తేలింది. గుజరాత్ తో సహా దేశంలో ఏ రాష్ట్రంలో కులగణన చేయలేదు. ఉద్యోగ, విద్య 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. తెలంగాణలో బీసీలకు 42 శాతంకు పెంచుకుంటామని అనుమతి అడిగితే మోదీకి వచ్చిన కష్టమేంది?. మా రాష్ట్రంలో మా బలహీనవర్గాల రిజర్వేషన్లు పెంచుకుంటామనే అడిగాం. మా రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అనుమతి ఇవ్వండి. తెలంగాణలో మీకు సన్మానం చేస్తాం. ఢిల్లీలో గద్దె మీద ఉన్నామనుకోకండి.. మీరు మళ్లీ మా గల్లీలోకి రావాల్సిందే. బీసీల కోసం ప్రాణాలు ఇస్తామని బండి సంజయ్ అంటుండు..రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తే చాలు. 

బీజేపీకి ఈ వేదికగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. తెలంగాణలో మాకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశమంతా కార్చిచ్చులా రగులుతుంది. ఇక మేం ఢిల్లీకి రాం.. మీరే మా గల్లీలోకి రావాలి. సయోధ్యలో భాగంగానే ఇవాళ ఢిల్లీకి వచ్చాం. పరేడ్ గ్రౌండ్ లో ధర్మయుద్ధం ప్రకటించండి.. మనబలాన్ని చాటుదాం. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు ఇవ్వకపోతే, మోదీ దిగిరాకపోతే.. ఎర్ర కోటపై మా జెండా ఎగరేస్తాం.. రిజర్వేషన్లు సాధించుకుంటాం’ అన్నారు.

33 శాతం బీసీ మహిళా నేతలకు సబ్ కోటా

దేశ వ్యాప్తంగా కులగణన జరపాలని, మహిళా రిజర్వేషన్లలో 33 శాతం బీసీ మహిళా నేతలకు సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ జంతర్ వద్ద నిర్వహించిన బీసీ ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన అనంతరం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం లభించింది. కేంద్రం దాన్ని ఆమోదించి అమలు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Continues below advertisement
Sponsored Links by Taboola