Revanth Reddy :  ఢిల్లీ లిక్కర్ స్కాంలో అందరికీ నోటీసులు జారీ చేసి ఢిల్లీ పిలిపించి  ప్రశ్నిస్తే కవితను మాత్రం సీబీఐ అధికారులు అనుమతి కోరుతున్నారని.. ఇక్కడే టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు బయటపడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.  టీఆరెస్, బీజేపీ చాలా కాలంగా  కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని రేవంత్ విమర్శించారు.  నిజంగా కేసీఆర్ అవినీతి చిట్టా భారతీయ జనతాపార్టీ వద్ద ఉంటే  బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తాను గతంలో ఫిర్యాదు చేసిన  కోకాపేట భూములు, బంగారు కూలీ, ఇతర కేసులపై విచారణ చేపట్టాలన్నారు. గతంలో ఎన్నికల కమిషన్ కు నేను చేసిన ఫిర్యాదులపై ఇప్పటికీ స్పందన లేదని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 


కేసీఆర్ అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు తాను  ఢిల్లీలో అయిదు రోజులు ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  డిసెంబర్ 6 లోపు స్పందించకపోతే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లకుండా పోతుందన్నారు. తెలంగాణలో బెంగాల్ తరహా ప్రయోగం జరుగుతోందని...  టీఆరెస్, బీజేపీ వార్ ఒక వీధి నాటకమని విమర్శించారు.  అమరవీరుల స్థూపం కాంట్రాక్టు ఆంధ్రా వాళ్లకు అప్పగించారని.. ఎనిమిదేళ్లు దాటినా అమరవీరుల స్థూపం పూర్తి కాలేన్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని రేవంత్ రెడ్డి పరిశీలించారు .


ఉస్మానియాలో జరిగిన అమరవీరుడు శ్రీకాంతాచారి వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పి టీఆర్‌ఎస్ గద్దెనెక్కిందన్నారు. మలిదశ ఉద్యమంలో అమరులైన 1200 మంది కుటుంబాలకు ఆర్థిక సాయం, ఉద్యోగం, 3ఎకరాల భూమి ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారని గుర్తుచేశారు. కానీ, 550 కంటే ఎక్కువ మంది అమరులను ప్రభుత్వం గుర్తించలేదని వ్యాఖ్యానించారు. కొందరి అడ్రస్ తెలియదని ప్రభుత్వం చెబుతోందన్న ఆయన.. ఇంతకంటే అవమానకరం మరొకటి ఉంటుందా? అని మండిపడ్డారు. తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు ఇచ్చిన శ్రీకాంతాచారి ప్రభుత్వానికి గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. నలుగురికి మంత్రి పదవులు ఇస్తే సామాజిక న్యాయం జరిగినట్టేనా అని నిలదీశారు. అవినీతి గురించి అధికారులు మాట్లాడితే బదిలీలు చేస్తున్నారని.. అమరవీరులకు స్తూపం కాంట్రాక్టు ఆంధ్రా వాళ్లకు ఇచ్చారని మండపడ్డారు.


ప్రస్తుత తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు నష్టపోతున్నాయన్న రేవంత్. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చేయాలో మీరు కూడా తమకు చెప్పాలని విద్యార్థులను కోరారు.వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పెద్దలు భవిష్యత్ ప్రణాళిక రూపొందించండి...మేం ఎం చేస్తే తెలంగాణకు మేలు జరుగుతుందో చెప్పాలని పిలుపునిచ్చారు.  దాన్ని అమలు చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఇతరుల్లా చెప్పేదొకటి చేసేదొక మనస్తత్వం  తనది కాదని..  తెలంగాణ ఆత్మగౌరవం కోసం కృషి చేయాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు.  మీరు ఇచ్చిన సూచన పత్రాన్ని మా మేనిఫెస్టోలో పెడతాంమని..  తెలంగాణ సమాజం కేసీఆర్ కు సర్వం ఇచ్చింది. ఇక ఇచ్చేదేం లేదన్నారు.  కేసీఆర్ ను దించితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.