Relief for KCR and Harish Rao: కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో భారీ ఊరట.. ఘోష్ కమిషన్ రిపోర్టుపై కీలక తీర్పు
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల వైఫల్యాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు బుధవారం సంచలన తీర్పునిచ్చింది.

Kaleshwaram Project | హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులకు భారీ ఊరట కలిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ చేపట్టిన పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని హైకోర్టు తెలిపింది. కనుక ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్‌లు
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అవకతవకలపై విచారణ కమిషన్‌ను నియమిస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవో నంబర్ 6ను హైకోర్టులో సవాల్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఐఏఎస్ అధికారులు స్మితా సభర్వాల్, ఎస్.కె.జోషిలు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. ఈ పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం ఇప్పటికే విచారణ జరిపి మార్చి 12న తీర్పును రిజర్వు చేసింది. ఈ నెల 8వ తేదీనే వెల్లడించాల్సి ఉన్నప్పటికీ, తీర్పు కాపీ రెడీగా లేకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో ఏప్రిల్ 22కు తీర్పు వాయిదా వేశారు.
నిబంధనలు పాటించని ఘోష్ కమిషన్
పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, తమపై అభియోగాలు మోపే ముందు కనీసం తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాప్రయోజనాల పేరుతో ఇతరుల వ్యక్తిగత పరువు ప్రతిష్ఠలు దెబ్బతీయడం సరైనది కాదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. దీనికి భిన్నంగా, ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీల వైఫల్యాలపై పూర్తిస్థాయి వాస్తవాలను వెలికితీసేందుకు, విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశామని కోర్టుకు వివరించారు. ఇరు వైపుల వాదనలను విన్న ధర్మాసనం ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదని, ఆ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది.
అభివృద్ధి చేయడమే మేం చేసిన తప్పా..
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పేరుతో ప్రభుత్వం తమను రాజకీయంగా వేధించేందుకే జస్టిస్ ఘోష్ కమిషన్‌ను అడ్డం పెట్టుకుందని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. అభివృద్ధి చేయడమే బీఆర్ఎస్ చేసిన తప్పా.. రైతులకు సాగునీళ్లు ఇవ్వాలని చూసినందుకు అవినీతి ఆరోపణలు చేయడం తగదన్నారు. ప్రాజెక్టులో చిన్న లోపాలు తలెత్తితే వాటిని సరిచేయడం మానేసి, మొత్తం ప్రాజెక్టే పనికిరాదని దుష్ప్రచారం చేయడం రాష్ట్ర ప్రయోజనాలకు, రైతులకు నష్టమని ఆయన మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా విచారణ జరిపి తమ పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలని ప్రయత్నిస్తూ చూస్తూ ఊరుకునేది లేదన్నారు.
సీబీఐ విచారణకు రేవంత్ డిమాండ్
38 వేల కోట్లు కావాల్సిన ప్రాజెక్టును ఏరియా మార్చి, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బ్యారేజీలు కట్టి ఖర్చును 1 లక్షా 50 వేల కోట్లకు పెంచి కమీషన్లు తీసుకున్నారని, అవినీతికి పాల్పడ్డారని సీఎం రేవంత్ ఇటీవల ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు





















