Relief for actor Navdeep in drug case: టాలీవుడ్ నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో తెలంగాణ హైకోర్టులో భారీ ఉపశమనం లభించింది. గత కొంతకాలంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవదీప్‌పై నమోదైన ఎఫ్.ఐ.ఆర్ (FIR)ను కొట్టివేస్తూ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. 2023లో నమోదైన ఒక డ్రగ్స్ కేసుకు సంబంధించి హైకోర్టు విచారణ చేపట్టి, ఆయనపై ఉన్న కేసును పూర్తిగా కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసు నుండి నవదీప్ క్లీన్ చిట్‌తో బయటపడినట్లయింది.
ఇతర నిందితుల వాంగ్మూలం ఆధారంగా నవదీప్ పై కేసు 2023 సెప్టెంబర్ నెలలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో మరియు రాజేంద్రనగర్ పోలీసులు జరిపిన సోదాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ కేసులో అరెస్టయిన కొందరు నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నవదీప్ పేరును ఎఫ్.ఐ.ఆర్‌లో చేర్చారు. నవదీప్ డ్రగ్స్ వినియోగదారుడని , నిందితులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు ఆరోపించారు. ఈ క్రమంలో నవదీప్ విచారణకు కూడా హాజరయ్యారు. అయితే, మొదటి నుంచీ తాను నిర్దోషినని, తనకు ఎటువంటి డ్రగ్స్ ముఠాతో సంబంధం లేదని నవదీప్ వాదిస్తూ వచ్చారు.
ఆధారాల్లేవని కొట్టేసిన కోర్టు
పోలీసులు తనపై నమోదు చేసిన కేసును సవాల్ చేస్తూ నవదీప్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం పోలీసుల వాదనలోని లోపాలను ఎత్తిచూపింది. "నవదీప్ వద్ద ఎక్కడా డ్రగ్స్ పట్టుబడలేదు. కేవలం నిందితుల వాంగ్మూలం ఆధారంగానే ఆయనను నిందితుడిగా చేర్చడం చట్టబద్ధం కాదు అని కోర్టు స్పష్టం చేసింది. ఎన్‌డిపిఎస్ చట్టం ప్రకారం పక్కా ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయలేమని అభిప్రాయపడుతూ, ఆయనపై ఉన్న ఎఫ్.ఐ.ఆర్‌ను రద్దు చేసింది.
నటులపై ఆధారాలు చూపలేకపోతున్న పోలీసులు పోలీసులు నవదీప్‌ను నిందితుడిగా చూపినప్పటికీ, ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లు కానీ, లేదా ఆయన వద్ద డ్రగ్స్ నిల్వలు ఉన్నట్లు కానీ నిరూపించే బలమైన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచలేకపోయారు. గతంలో కూడా పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, సరైన ఆధారాలు లేకపోవడంతో వారు విముక్తి పొందారు. ఇప్పుడు నవదీప్ విషయంలోనూ ఇదే పునరావృతమైంది.
నవదీప్ పేరు గతంలో 2017లో జరిగిన భారీ డ్రగ్స్ స్కాండల్‌లో కూడా వినిపించింది. అప్పట్లో సిట్ (SIT) విచారణలో ఆయన క్లీన్ చిట్ పొందారు. మళ్లీ 2023లో మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఆయన పేరు తెరపైకి రావడంతో కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా హైకోర్టు తీర్పుతో ఆయనపై ఉన్న మచ్చ తొలగిపోయినట్లయింది.