Razakar Movie Controversy: తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల వేడి పెరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు బలంగా ప్రజల్లోకి వెళ్లేందుకు కసరత్తు చేస్తున్నాయి. వివిధ హామీల పేరుతో ప్రజలను ఆకట్టుకునేందుకు శతవిధాలుగా  ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. మేనిఫెస్టోపై కూడా దృష్టి పెట్టింది. ఎలాంటి హామీలు ఇవ్వాలనే దానిపై తెరవెనుక చర్చలు జరుపుతోంది. దసరా తర్వాత బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశముంది. ఇక కాంగ్రెస్ ఇప్పటికే పలు హామీలు ప్రకటించిన విషయం తెలిసిందే.


ఇక ఎన్నికల నేపథ్యంలో రజాకార్ సినిమాపై వివాదం నడుస్తోంది. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల అవ్వగా.. ఇది వివాదాస్పదంగా మారింది. నిజాం పాలనలో చోటుచేసుకున్ను పరిణామాలను ఈ టీజర్‌లో చూపించగా.. ముస్లింలను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముస్లింలను తప్పుగా చూపించే ప్రయత్నం చేశారని మత సంఘాలు విమర్శిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై నిషేధం విధించాలని, విడుదల కాకుండా చర్యలు తీసుకోవాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సినిమా టీజర్ ఉందని చెబుతున్నారు.


వివాదాస్పదమైన ఈ టీజర్‌పై ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్పందించగా.. తాజాగా ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ సినిమాల పేరుతో మత విద్వేషాలు, అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంటుందని ఆరోపించారు. రజాకార్ మూవీకి నిర్మాతగా బీజేపీ నేత ఉన్నారని అన్నారు. జనాల మధ్య దూరం పెంచాలనే ఉద్దేశంతో సినిమాల పేరుతో బీజేపీ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిందని విమర్శించారు. ఇవాళ కవిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రజాకార్ టీజర్‌పై మండిపడ్డారు. ఇలాంటి సినిమాల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని,  శాంతికి కాపాడాలంటే ఇలాంటి సినిమాలను తిరస్కరించాలని పిలుపునిచ్చారు.


తెలంగాణ శాంతి, సామరస్యతకు మారు పేరు అని, మతపరమైన ఘర్షణలు లేకుండా శాంతియుతంగా ఉండే రాష్ట్రమని కవిత స్పష్టం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌కు ప్రజలు వస్తారని, ఇలాంటి వివాదాస్పద సినిమాల వల్ల మతవిద్వేషాలు చెలరేగే అవకాశముంటుందని అన్నారు. అయితే రజాకార్ టీజర్‌పై ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్పందించారు. సినిమా వెనుక బీజేపీ నేతలు ఉన్నారని, వారి సూచనల ప్రకారమే దర్శక, నిర్మాతలు సినిమా తీశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి సినిమాలు తీయడం బీజేపీకి అలవాటేనని, దీనిపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి దెబ్బతినకుండా తెలంగాణ పోలీసులు కూడా చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. బీజేపీ జోకర్స్ స్వార్థ రాజకీయాల కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అన్నారు. అటు మంత్రి హరీష్ రావు కూడా ఈ సినిమా టీజర్‌పై మండిపడ్డారు.


కాగా రజాకార్ ఫైల్స్ పేరుతో సినిమా తీస్తామని బీజేపీ నేతలు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో టీజర్ విడుదల కావడంతో దీని వెనుక బీజేపీ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మూవీకి యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించగా.. నారాయణ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.