Rahul Gandhi : టీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తులేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని రాహుల్ తెలిపారు. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ తో పొత్తు వద్దని టీపీసీసీ నిర్ణయమని, దానిని స్వాగతిస్తున్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య పోటీ అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు మునుగోడు ఉపఎన్నికకు రూ.వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. 


దేశ సమైఖ్యత కోసమే యాత్ర  


బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి తీరుతుందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విభజన రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకునేందుకు భారత్‌ జోడో యాత్ర చేస్తున్నారన్నారు. ఈ యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారిని చైతన్య పరుస్తున్నామని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రధాని మోదీ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తుందని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు.  దేశ సమైక్యత కోసం కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర చేపట్టిందన్నారు. 


రాజ్యాంగ వ్యవస్థలు నాశనం 


" మోదీ హయాంలో ప్రణాళికా బద్దంగా రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారు. ఇది దేశానికి నష్టదాయకం. ఉద్యోగాల కల్పన లేకుండా చేశారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆరెస్ ఒకే విధానాన్ని అవలంభిస్తున్నాయి. సంపదను కొద్ది మంది వ్యాపారుల చేతుల్లో పెడుతున్నారు. దేశ సమైక్యత కోసమే మేం భారత్ జోడో యాత్ర చేపట్టాం. బీజేపీ విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలనే మా ప్రయత్నం. మేం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రూట్ ను ఎంచుకున్నాం. వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాలలో యాత్ర కొనసాగేలా చేసుకున్నాం. అంతే కానీ గుజరాత్ లో యాత్ర సాగించకూడదని కాదు. కాంగ్రెస్ ప్రజాస్వామిక పార్టీ.. ఇక్కడ నియంతృత్వం ఉండదు. ప్రజాస్వామ్య పద్దతిలో కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకుంది. కానీ బీజేపీ, టీఆరెస్, ఇతర పార్టీలు ఎప్పుడైనా ఇలా ఎన్నుకున్నాయా? బీజేపీ, టీఆరెస్ లు ప్రజా ధనాన్ని దోచుకుంటున్నాయి. అందుకే ఆ రెండు పార్టీలు ఒకటే అని పదే పదే చెబుతున్నా టీఆరెస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు."- రాహుల్ గాంధీ 


తెలంగాణలోకాంగ్రెస్ దే అధికారం


అవినీతిమయమైన, ప్రజా ధనాన్ని లూటీ చేసే టీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ అన్నారు. రాజకీయంగా కొందరు నాయకులు ఎవరికి వారు తామది పెద్ద పార్టీగా ఊహించుకోవచ్చన్నారు.  టీఆర్ఎస్ కూడా తమకు తాము నేషనల్ పార్టీ, గ్లోబల్ పార్టీ అని ఊహించుకోవడంలో తప్పులేదని రాహుల్ గాంధీ అన్నారు. చాలా సంవత్సరాల క్రితమే తాను భారత్ జోడో యాత్ర చేయాలనుకున్నానని, కానీ కోవిడ్ విజృంభించడం, ఇతర కారణాలతో చేయలేకపోయానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి కూడా ఈ యాత్ర ఉపయోగపడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్ర క్రీడా యాత్ర కాదని, కచ్చితంగా పొలిటికల్ యాత్రే అన్నారు.