Narsingi Police Case Santosh Goud: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌పై ఆయన కుమారుడు సంతోష్ గౌడ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తన ప్రేమ వివాహాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా తండ్రే తనపై, తనకు అండగా నిలిచిన వారిపై దాడులు చేయిస్తున్నారని సంతోష్ గౌడ్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రజాప్రతినిధిగా ఉన్న సొంత తండ్రిపైనే కుమారుడు ఫిర్యాదు చేయడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.
బాధితుడు సంతోష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రూపా రెడ్డి కుమార్తెను వివాహం చేసుకోవాలని తాను నిశ్చయించుకున్నప్పటి నుంచి కుటుంబంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల మణికొండలోని రూపా రెడ్డి నివాసానికి కొందరు అపరిచిత వ్యక్తులు వచ్చి భయాందోళనలు సృష్టిస్తూ గొడవకు దిగారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక పూర్తిగా తన తండ్రి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తమే ఉందని, ఆస్తి వివాదాలు, అంతర్గత మనస్పర్థల కారణంగానే ఈ రకమైన దాడులు చేయిస్తున్నారని సంతోష్ ఆరోపించారు.
ఘటన జరిగిన వెంటనే తాము ప్రాణభయంతో డయల్-100కు కాల్ చేసి అత్యవసర సమాచారం అందించినప్పటికీ, నార్సింగ్ పోలీసులు స్పందించిన తీరుపై సంతోష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ఫిర్యాదును పోలీసులు సరిగా స్వీకరించకపోగా, శాసనసభ్యుడి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఉల్టా తమపైనే అక్రమ కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారని ఆయన విమర్శించారు. మీడియా ముందుకు వచ్చి నిజాలు బయటపెట్టినందున ప్రస్తుతం తమ ప్రాణాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందని సంతోష్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వివాదంపై బాధితురాలు రూపా రెడ్డి ఇది ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు. తమపై తప్పుడు ఆరోపణలతో కేసులు మోపి జైలుకు పంపించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. తాము చట్టబద్ధంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రశాంతంగా జీవించే తమ కుటుంబానికి ఈ రకమైన వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు. రాజేంద్రనగర్ శాసనసభ్యుడి ఇంట్లో తలెత్తిన ఈ అంతర్గత వివాదం వైరల్ అవుతోంది. అయితే, తన కుమారుడు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భిన్నంగా స్పందించారు.
వాడెవడో తనకు తెలియదని..తనకు సంబంధం లేదని ప్రకాష్ గౌడ్ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై తాను సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని అన్నారు.
