Raja Singh is desperate to rejoin the BJP: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద , ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రస్తుతం రాజకీయంగా  ఒంటరి   పయనం చేస్తున్నారు. గతంలో  బీజేపీకి  చేసిన రాజీనామా ఆయన రాజకీయ భవిష్యత్తును సందిగ్ధంలో పడేసింది. అయితే, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాను కుటుంబంతో  గొడవపడి బయటకు వచ్చానని, ఎప్పటికైనా మళ్లీ తన సొంత గూటికే చేరుతానని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Continues below advertisement

ఎవరు పిలిచినా బీజేపీలో చేరేందుకు రెడీ 

రాజాసింగ్  తన నిలువెల్లా బీజేపీ రక్తమే ప్రవహిస్తోందని, తాను ఎప్పటికీ బీజేపీ మనిషినేనని చెప్పుకొస్తున్నారు. రాష్ట్ర స్థాయి నేతలు లేదా కేంద్ర నాయకత్వం నుంచి పిలుపు వస్తే వెనుకాడకుండా పార్టీలో చేరిపోతానని స్పష్టం చేశారు. ఒక రకంగా బీజేపీ అగ్ర నాయకత్వం వైపు ఆయన దీనంగా చూస్తున్నారని, తిరిగి పార్టీలో చేరడం కోసం ఆయన తీవ్రంగా ఆరాటపడుతున్నారని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.నిజానికి రాజాసింగ్ పార్టీకి దూరం కావడానికి ఆయన తొందరపాటే కారణం. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగిన సమయంలో, తాను కూడా పోటీలో ఉంటానని హడావుడి చేస్తూ ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అప్పటికే ఆయన వ్యవహారశైలితో విసిగిపోయి ఉన్న రాష్ట్ర నేతలు, ఆ రాజీనామాను వెంటనే ఆమోదించి ఆయనకు షాక్ ఇచ్చారు.

Continues below advertisement

అనర్హతా వేటు వేసే చాన్స్ ఉన్నా పట్టించుకోని బీజేపీ

సాధారణంగా గెలిచినపార్టీ సభ్యత్వాన్ని స్వచ్చందంగా వదులుకుంటే అనర్హతా వేటు పడుతుంది. అయితే బీజేపీ ఫిర్యాదు చేయాలి. కానీ ఆయన పదవిని ఊడగొట్టడానికి బీజేపీ ఆసక్తిగా లేదు. రాజీనామా చేసినప్పటి నుండి  ఆయన ఏ పార్టీలోనూ చేరలేక, స్వతంత్రంగానే కొనసాగుతున్నారు. ఆయన హిందుత్వ వాదానికి బీజేపీ తప్ప మరే పార్టీ సరిపోదు, అదే సమయంలో ఇతర పార్టీలు కూడా ఆయనను చేర్చుకునే సాహసం చేయడం లేదు. ప్రస్తుతం రాజాసింగ్ తనకున్న పరిచయాలతో మళ్లీ పార్టీలో యాక్టివ్ కావాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఉన్న సత్సంబంధాలను ఉపయోగించుకుని, కేంద్ర పెద్దల ద్వారా బీజేపీలోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. 

తెలంగాణ నేతలందరితోనూ సున్నమే!

రాజాసింగ్ ఎవరితోనూ సఖ్యతగా ఉండరు.  తెలంగాణ బీజేపీలోని కీలక నేతలైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ ,రామచంద్రరావు వంటి వారితో రాజాసింగ్‌కు సత్సంబంధాలు లేకపోవడం ఆయనకు పెద్ద మైనస్‌గా మారింది. రాష్ట్ర నేతల నుంచి గ్రీన్ సిగ్నల్ రాకుండా కేంద్ర పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకునే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. గతంలో వివాదాస్ప వీడియోలు పెట్టి మత సామరస్యాన్ని దెబ్బతీసినందుకు  సస్పెన్షన్‌కు గురైనప్పుడు, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాత్రమే పార్టీ ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసి టిక్కెట్ ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. ఎన్నికల వరకు ఆయనను వెయిటింగ్ లిస్టులో ఉంచి, చివరి నిమిషంలో పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంది. అప్పటివరకు రాజాసింగ్ తన రాజకీయ ఉనికిని కాపాడుకుంటూ, బీజేపీ పెద్దల పిలుపు కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది.