Governor Tamilisai On KCR : తెలంగాణ గవర్నర్ తమిళి సై మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుదుచ్చేరిలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య రిపబ్లిక్ డే వేడుకలు జరగకుండా చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. కొందరు కోర్టుకు వెళ్లడంతో గణతంత్ర వేడుకలకు అవకాశం వచ్చిందన్నారు. గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని రెండు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశానని గవర్నర్ తెలిపారు. అయినా దానిని పక్కనపెట్టి రాజ్‌భవన్‌లోనే వేడుకలు జరుపుకోవాలని రెండు రోజుల క్రితం సమాచారం ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.  కనీసం ప్రసంగ పాఠాన్ని పంపలేదన్నారు. హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయలేదన్నారు. 


కేసీఆర్ సర్కార్ పై కేంద్రానికి రిపోర్టు 


తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని కేసీఆర్ సర్కార్ పై మరోసారి గవర్నర్ తమిళి సై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చానన్నారు. ఖమ్మంలో  5 లక్షల మందితో కేసీఆర్ బహిరంగ సభ పెట్టారని, ఆ సభకు లేని కరోనా నిబంధనలు గణతంత్ర వేడులకే గుర్తు వచ్చాయా? అని ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి రాజ్‌భవనంపై కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ విలువలు పాటించడంలేదని గవర్నర్ తమిళిసై ఆరోపించారు. 






ఫామ్ హౌస్ లు కట్టడం అభివృద్ధి కాదు


గురువారం ఉదయం హైదరాబాద్ రాజ్ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లోనూ గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ తీరుపట్ల పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదామని, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ హక్కును నిలబెట్టుకుందామని అన్నారు. కొత్త భవనాల నిర్మాణం అభివృద్ధి కాదని, నేషనల్ బిల్డింగ్ అభివృద్ధి అన్నారు. ఫామ్ హౌస్‌లు కట్టడం అభివృద్ధి కాదన్నారు. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు, రాష్ట్ర విద్యాలయాలలో అంతర్జాతీయ ఫెసిలిటీ ఉండాలన్నారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం- రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అంటూ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతో తనకున్న బంధం మూడేళ్లు మాత్రమే కాదని, పుట్టుకతో ఉందన్నారు. తెలంగాణ ప్రజల అభ్యున్నతిలో తన పాత్ర తప్పకుండా ఉంటుందని తెలిపారు. తన పెద్ద బలం.. హార్డ్ వర్క్, నిజాయతీ, ప్రేమ అని వ్యాఖ్యానించారు. కొంత మందికి తాను నచ్చకపోవచ్చని, కానీ తెలంగాణ ప్రజలంటే తనకెంతో ఇష్టమన్నారు.