తెలంగాణలో ఎన్నికల ప్రచారం మరో 5 రోజులే ఉన్నందున వివిధ పార్టీల ఢిల్లీ పెద్దలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రియాంక గాంధీ రేపటి నుంచి రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 1 గంటలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరగనుంది. దీనికి కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ రానున్నట్లు ఏఐసీసీ మీడియా కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ మేనేని రోహిత్ రావు, ఏఐసీసీ కరీంనగర్ పార్లమెంట్ పర్యవేక్షకుడు క్లిష్టఫర్ తిలక్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కు మద్దతుగా 24వ తేదీ మధ్యాహ్నం 1 గంటలకు హెలికాప్టర్ ద్వారా ప్రియాంక గాంధీ హుస్నాబాద్ కు రానున్నట్లు వెల్లడించారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు భారీ బహిరంగ సభలో పాల్గొంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నట్లు సర్వేలన్నీ చెబుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్త్రం ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోగా, ఉన్న రేషన్ కార్డులను తొలగించిందని వారు ఆరోపించారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ హుస్నాబాద్ కు చేసిన అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు భారీ బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం భారీ బహిరంగ సభ జరగనున్న సభ స్థలిని, ఏర్పాట్లను పరిశీలించారు.
24న మూడు చోట్ల ప్రియాంక ప్రచారం
24వ తేదీన ఉదయం 11 గంటలకు పాలకుర్తిలో ప్రియాంక తొలి సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు హుస్నాబాద్ వెళ్తారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు ధర్మపురి సభలో ప్రసంగిస్తారు. 25వ తేదీన పాలేరు, ఖమ్మం, వైరా, మధిర నాలుగు నియోజకవర్గాలలో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు.