Prime Minister Modi: అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. ప్రకృతిని విధ్వంసం చేసి.. వన్యప్రాణులను చంపుతున్నారని ఆయన ఆరోపించారు. మేం పర్యావరణాన్ని కాపాడుతూంటే.. వారు అటవీ సంపదను నాశనం చేస్తున్నారని విమర్శించారు.
హర్యానాలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై మోదీ విమర్శలు
అంబేద్కర్ జయంతి సందర్భంగా హర్యానాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ , ఆ పార్టీ ప్రభుత్వలపై విమర్శలు గుప్పిస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రస్తావన తీసుకు వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి..అడవులను ధ్వంసం చేయడంలో బిజీగా ఉందన్నారు. అది కాంగ్రెస్ నైజమన్నారు.
దేశవ్యాప్తంగా వైరల్ అయిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం
కంచ గచ్చిబౌలి భూములను తెలంగాణ ప్రభుత్వం అమ్మడానికి ఏర్పాట్లు చేసింది. అయితే ఆ భూములు చాలా కాలంగా నిరుపయోగంగా ఉండటం వల్ల పెద్ద ఎత్తున చెట్లు పెరిగాయి. హెచ్‌సీయూని ఆనుకుని ఉండటంతో వన్య ప్రాణులు అక్కడ నివాసం ఉంటున్నాయని చెబుతున్నారు. ఇటీవల వంద ఎకరాల్లో చదును చేయడంతో వన్య ప్రాణులు రోడ్లపైకి వచ్చి చనిపోతున్నాయని ప్రచారం జరిగింది. అక్కడి వీడియో జాతీయ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. అందుకే ప్రధాని మోదీ దృష్టికి ఈ అంశం వెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఫేక్ వీడియోలు అని కేసులు పెడుతున్న తెలంగాణ ప్రభుత్వం
అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ వీడియోలన్నీ ఫేక్ అని.. వన్యప్రాణులన్నీ.. రెండు వేల ఎకరాల మేర విస్తరించి ఉన్న హెచ్‌సీయూ యూనివర్శిటీలో ఉన్నాయని.. అక్కడే ఏదో జరుగుతోందని అంటోంది. అంతే కాదు ఫేక్ వీడియోలను సృష్టించిన వారిపై .. ప్రచారం చేసిన వారిపై కేసులు పెడుతోంది. అవన్నీ ఏఐ వీడియోలని పోలీసులు ఫోరెన్సిక్ నుంచి నిర్ధారణ తీసుకు వచ్చారు. ఇప్పుడు అనూహ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీనే అక్కడ అడవిని నాశనం చేస్తున్నారని.. వన్య ప్రాణుల్ని చంపేస్తున్నారని చెప్పడంతో రాజకీయంగా కొత్త కలకలం రేగడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రధాని మోదీ తీరుపై ఇటీవల రేవంత్ విమర్శలు చేస్తున్నారు. అహ్మదాబాద్ లో జరిగిన కాంగ్రెస్ సమావశంలో బీజేపీ, బ్రిటిష్ వాళ్ల కన్నా డేంజర అని విర్శించారు.