Police identified the person who threatened to kill Rajasingh  : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గత కొంత కాలంగా దుండగులు వరసగా కాల్స్ చేసి బెదిరిస్తున్నారు.  శ్రీరాముని శోభాయాత్ర చేస్తే చంపేస్తామని, తన కొడుకుని సైతం చంపేస్తామని దుండగులు గత కొంత కాలంగా కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆయన ఇదివరకే పోలీసులను ఆశ్రయించారు.  దర్యాప్తు చేసిన పోలీసులు రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ చేసిన వారిని సైబర్ క్రైమ్ పోలీసులు కనిపెట్టారు.  రాజాసింగ్‌కు కువైట్‌లో మకాం వేసిన మహమ్మద్ ఖాసిం అనే వ్యక్తి కాల్స్ చేస్తున్నట్లు గుర్తించారు. అతను గత 14 ఏళ్లు కువైట్‌లో ఉంటున్నారని, చాంద్రాయణగుట్ట నుంచి దుబాయ్‌కి వెళ్లి అక్కడి నుంచి కువైట్‌లో ఖాసిం సెటిల్ అయ్యాడని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్‌పై మమ్మద్ ఖాసిం కోసం సైబర్ క్రైమ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా రాజాసింగ్‌కు ఖాసిం బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.                                                                                                        


నమ్మిన సిద్ధాంతం కోసం తాను ఎంత దూరమైనా వెళతానని రాజాసింగ్ ప్రకటించారు.  ఇలాంటి బెదిరింపులు తననేమీ చేయలేవని స్పష్టం చేశారు. బెదిరింపులకు పాల్పడేవారు ఎంతటి స్థాయి వ్యక్తులు అయిన తనకు అవసరం లేదని వారికి నిజంగా దమ్ముంటే తన ముందుకు వచ్చి వార్నింగ్ ఇవ్వాలన్నారు. అయితే తనకి ఏ ఏ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అనేది కూడా తెలిపారు. 7199428274, 9223532270 నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఆయన వివరించారు. కాగా జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరుగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.                       


రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ రావడం ఇదేమి మొదటి సారి కాదు గతంలో కూడా ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. కొంతకాలం కిందట ఎమ్మెల్యే రాజాసింగ్ ను చంపేస్తామంటూ దుండగులు బెదిరింపు కాల్స్ చేయగా ఆ కాల్స్ పాకిస్తాన్ నుంచి వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో రాజాసింగ్ వీడియోలు కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. తనకు వచ్చిన కాల్స్ పై అప్పట్లో డీజీపీగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ కు ఎమ్మెల్యే రాజా సింగ్ ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు తనకు వచ్చిన ఫోన్ నంబర్స్ అన్నింటినీ పేపర్ పై రాసుకున్నానని రాజా సింగ్ వెల్లడించారు.