Bhubharathi :  ధరణి , భూభారతి రిజిస్ట్రేషన్లను అడ్డు పెట్టుకుని ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో సంచలనం సృష్టించిన ఈ రూ. 3.90 కోట్ల కుంభకోణంలో ప్రమేయం ఉన్న 15 మంది నిందితులను జనగామ పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో తొమ్మిది మంది పరారీలో ఉన్నారు. ఈ ముఠా నుండి రూ. 63.19 లక్షల నగదుతో పాటు సుమారు కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, కారు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడించారు. 

Continues below advertisement

 టెక్నాలజీతో  చలాన్  మాయాజాలం                              

 కుంభకోణంలో ప్రధాన నిందితులైన పసునూరి బసవరాజు, జెల్లా పాండు యాదగిరిగుట్టలో ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్లు నిర్వహిస్తూ ఈ మోసానికి తెరలేపారు. వీరు వెబ్‌సైట్‌లోని  ఇన్‌స్పెక్ట్ ఎలిమెంట్, ఎడిట్ అప్లికేషన్  ఆప్షన్లను ఉపయోగించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలాన్ రుసుమును సాఫ్ట్‌వేర్ ద్వారా తగ్గించేవారు. రైతుల వద్ద నుంచి పూర్తి మొత్తాన్ని వసూలు చేసి, ప్రభుత్వానికి మాత్రం తక్కువ మొత్తాన్ని చెల్లిస్తూ నకిలీ రసీదులను సృష్టించేవారు. ఈ నకిలీ చలాన్లను స్థానిక ఎమ్మార్వో , రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సమర్పించి రిజిస్ట్రేషన్లు పూర్తి చేయించేవారు. సులభంగా డబ్బు సంపాదించే క్రమంలో వీరు మీ-సేవ కేంద్రాలు, మధ్యవర్తులతో కలిసి ఈ దందా సాగించారు.

Continues below advertisement

 1,080 డాక్యుమెంట్లు.. 22 కేసులు                                           

నిందితులు ఇప్పటివరకు జనగామ, యాదాద్రి జిల్లాల్లో సుమారు 1,080 డాక్యుమెంట్లకు సంబంధించి ఇలాంటి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తులకు, ఆన్‌లైన్ సెంటర్ల నిర్వాహకులకు 10 నుండి 30 శాతం వరకు కమిషన్లు ఇచ్చి ముఠాగా ఏర్పడ్డారు. ఈ భారీ కుంభకోణంపై ఇప్పటివరకు యాదాద్రి జిల్లాలో 15 కేసులు, జనగామ జిల్లాలో 7 కేసులు కలిపి మొత్తం 22 కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ అయిన వారిలో పసునూరి బసవరాజు, జెల్లా పాండుతో పాటు గణేష్ కుమార్, శ్రీనాథ్, వెంకటేష్, శ్రావణ్ వంటి పలువురు నిందితులు ఉన్నారు.

 పోలీసుల చాకచక్యం - కమిషనర్ అభినందనలు                    

సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డుపెట్టుకుని సాగుతున్న ఈ వ్యవస్థీకృత నేరాన్ని ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన జనగామ డీసీపీ  , ఏఎస్పీ  , ఇన్‌స్పెక్టర్లు  , ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. పరారీలో ఉన్న మిగిలిన తొమ్మిది మంది నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు. రైతులు కూడా ఇటువంటి మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, అధికారిక రసీదులను సరిచూసుకోవాలని సూచించారు.