PM Modi Comments in Zaheerabad: ఈ పదేళ్లలో దేశం ఎంత ముందుకు వెళ్లిందో దేశ ప్రజలు అంతా చూశారని, అంతకుముందు కాంగ్రెస్ పాలనలో అంత అవినీతి ఉందో కూడా అందరూ చూశారని ప్రధాని మోదీ అన్నారు. భారత్ ను కాంగ్రెస్ పార్టీ అవినీతి ఊబిలోకి నెట్టేసిందని అన్నారు. ‘‘కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా పంచ సూత్రాలతో పాలన చేస్తుంది. కాంగ్రెస్ పంచసూత్రాలు అంటే అవినీతి, అబద్ధాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, మాఫియా, కుటుంబ రాజకీయాలు’’ అని ప్రధాని మోదీ అన్నారు. జహీరాబాద్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. 


తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. డబుల్ ఆర్ ట్యాక్ వసూలు చేసి ఢిల్లీలో కప్పం కడుతున్నారని.. వెంటనే ఆ డబుల్ ఆర్ ట్యాక్స్‌ను అడ్డుకోవాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లు దొడ్డిదారిలో డబుల్ ఆర్ ట్యాక్స్ కడుతున్నారని ఆరోపించారు. పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మన పైన సంపద పన్ను కూడా వేస్తారని.. అలా మన సంపదలో 55 శాతాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పారు. మొన్నటి వరకూ తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దోచుకుంటుందని అన్నారు.


కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అవినీతి కుంభకోణం. బీఆర్ఎస్ పాలనలో ఓటుకు నోటు కేసును తొక్కి పెట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరు కాదు.. అవి రెండు ఒకటే పార్టీలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం కుంభకోణంపై కాంగ్రెస్ మాట్లాడింది. అధికారంలోకి రాగానే కాళేశ్వరం కుంభకోణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కి పెట్టింది. అలా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్ఫరం సహకరించుకుంటూ తోడు దొంగలుగా ఉంటున్నారు. 


రైతులను బీజేపీ భగవత్ స్వరూపులుగా పరిగణిస్తోంది. 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేదు. 


అయోధ్యలో రామ మందిర నిర్మాణం 500 ఏళ్లుగా భారతీయుల కల. అక్కడ అయోధ్య మందిరం నిర్మాణం మోదీ వల్లనో, బీజేపీ వల్లనో కాలేదు. మీ ఓటు వల్లనే సాధ్యం అయింది. ఇటు హైదరాబాద్ లో పండుగలు జరుపుకోవాలంటే ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. ఓ వర్గం ఓట్ల కోసమే హైదరాబాద్ లో పండుగలపై ఆంక్షలు విధిస్తున్నారు’’ అని ప్రధాని మోదీ అన్నారు.