సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ




అతివేగం ప్రమాదకరం అని ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. ఫలితం నిండు ప్రాణాలు రెప్పపాటులో గాల్లో కలసిపోతున్నాయి. తెలంగాణ నాగర్ కర్నూల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణం. దైవదర్శనానికి వెళ్లొస్తుడంగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనపై ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్రమోదీ….గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున , గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.




దైవదర్శనానికి శ్రీశైలం వెళ్లొస్తున్న మిత్ర బృందం ప్రయాణిస్తున్న కారు వేగంగా ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని నిజాంపేటకు చెందిన వెంకటేశ్‌ (28), అతని మిత్రుడు సుచిత్ర ప్రాంతానికి చెందిన వంశీకృష్ణ (25), సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం గండిగూడంకు చెందిన నరేశ్‌ మరో ఇద్దరు మిత్రులతో కలిసి గురువారం మధ్యాహ్నం శ్రీశైలానికి కారులో వెళ్లారు. శుక్రవారం మల్లిఖార్జున స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ఆర్‌కేనగర్‌ ప్రాంతానికి చెందిన సుబ్బలక్ష్మి, ఆమె కొడుకు శివకుమార్‌తోపాటు వారి దగ్గరి బంధువైన విశాఖపట్నం తునికికి చెందిన రాంమ్మూర్తి ఆయన కుమారుడు శివతో కలిసి శుక్రవారం శ్రీశైలానికి కారులో బయల్దేరారు. సాయంత్రం 6:30 గంటలకు నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలం చెన్నారం-ఆవులోనిబావి వద్ద వీరు ప్రయాణిస్తున్న కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో సుబ్బలక్ష్మి, శివకుమార్‌, రామ్మూర్తి, శివతోపాటు మరో కారులో ఉన్న వంశీకృష్ణ, వెంకటేశ్‌ మరో ఇద్దరు.. మొత్తం ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు.




అతివేగం కారణంగా కార్లు నుజ్జునుజ్జవ్వగా, మృతదేహాలు అందులోనే ఇరుక్కున్నాయి. పోలీసులు గంటపాటు శ్రమించి మృతదేహాలను వెలికితీసి అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నరేశ్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలవద్ద లభ్యమైన గుర్తింపు కార్డులు, కారు నంబర్ల ఆధారంగా మృతుల బంధువులకు…పోలీసులు సమాచారం అందించారు. ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, కలెక్టర్‌ శర్మన్‌ చౌహాన్‌, ఎస్పీ సాయిశేఖర్‌, ఇతర అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని... కార్లలో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు.




ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి


ప్రమాదం ఘటనపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సమాచారం తెలిసిన వెంటనే ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఫోన్‌చేసి, ప్రమాద పూర్వాపరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు వైద్యసేవలందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.