Revanth Reddy: ఓటుకు నోటు కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని,  ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇరు వర్గాల వాదనలు వినింది. ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని, అన్నీ విషయాలు ట్రయల్ కోర్టుకు ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వం తరపు లాయర్లు వాదించారు. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదని, కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదించారు. ఇరు వర్గాల వాదనల అనంతరం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. దీంతో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి షాక్ తగిలినట్లు అయింది.


గతంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించి హైకోర్టును రేవంత్ ఆశ్రయించారు. అసలు ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే రేవంత్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును రేవంత్ రెడ్డి ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇవాళ జస్టిస్ ఎన్వీఎన్ భట్టి, సంజీవ్ ఖన్నాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదోపవాదనలు అనంతరం పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఈ కేసులో రేవంత్ తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.


తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఏకంగా అప్పటి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ కేసులో చిక్కుకోవడంతో తెలుగునాట కలకలం రేపింది. రేవంత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్ కాల్ మాట్లాడిన ఆడియో ప్రకంపనలు సృష్టించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందేందుకు  స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఆఫర్ చేయగా.. ఆయన ఇంట్లో రేవంత్ రెడ్డి డబ్బుల బ్యాగ్‌తో అడ్డంగా ఏసీబీకి బుక్ అయ్యారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొద్ది నెలల పాటు జైల్లో ఉండి, ఆ తర్వాత బెయిల్‌పై బయటకొచ్చారు. ఈ కేసులో చంద్రబాబును కూడా ముద్దాయిగా చేర్చాలని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎప్పటినుంచో న్యాయపోరాటం చేస్తున్నారు. 


2017లో ఓటుకు నోటు కేసుకు సంబంధించి సుప్రీంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు పిటిషన్లు వేశారు. ఈ కేసులో చంద్రబాబును కూడా ముద్దుగా చేర్చాలని కోరుతూ ఒక పిటిషన్ వేయగా..  సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలని మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై అక్టోబర్ 4న విచారణ జరగనుంది. ఐటెం నెంబర్ 42గా లిస్ట్ అవ్వగా..  జస్టిస్ సంజయ్ కుమార్, ఎంఎం సుందరేశ్ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది.  తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలవ్వగా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓటమి పాలవ్వగా.. ఈ సారి ఎలాగైనా గెలుపేందుకు చంద్రబాబు ఇప్పటినుంచే వ్యూహలు రచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి రావడం కీలకంగా మారింది.